స్నాన యాత్రకు శ్రీక్షేత్రం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

స్నాన యాత్రకు శ్రీక్షేత్రం సిద్ధం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

దైతపతుల ప్రవేశం

రేపు స్నాన యాత్ర

79 ప్లాటూన్ల పోలీసుల

మోహరింపు

భువనేశ్వర్‌: దేవ స్నాన పూర్ణిమ దగ్గర పడుతుంది. జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని ఏటా మూల విరాట్లకు బహిరంగ స్నాన వేదికపై జలాభిషేకం నిర్వహించడం ఈ యాత్ర విశిష్టత. పూరీ శ్రీ జగన్నాథ స్వామి వార్షిక రథ యాత్ర ఆది ఘట్టంగా ఈ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి, సుదర్శనుడి స్నాన యాత్రకు సంబంధించిన సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి.

దైతపతుల రంగ ప్రవేశం

జగతి నాథుని సేవల్లో దైతపతులది కీలక స్థానం. మూల విరాటుల గోప్య సేవలకు ఈ వర్గం ప్రాతినిథ్యం వహిస్తుంది. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్నాన యాత్ర, రథ యాత్ర వంటి కీలక యాత్రలు, ఉత్సవాలకు మూల విరాటులుని సిద్ధం చేస్తారు. రత్న వేదికపై మూల విరాటుల బాగోగుల్ని ఈ వర్గం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది.

ముందస్తు సన్నాహాలు

దేవ స్నాన పూర్ణిమ ఉత్సవానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 29న జరగనున్న స్నాన యాత్ర ఏర్పాట్లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. దైతపతులు శ్రీ మందిరం లోనికి ప్రవేశించారు. బొడొ సింగార్‌ అలంకరణ తర్వాత పొహుడొ (విరామం) హారతి నిర్వహిస్తారు.

మూల విరాట్ల భద్రత కీలకం

రత్న వేదికపై నుంచి మూల విరాట్లు శ్రీ మందిరం మేఘనాథ్‌ ప్రహరి ప్రాంగణం ఆరు బయట విస్తరించి ఉన్న బహిరంగ స్నాన మండపానికి తరలి వస్తా యి. ఈ క్రమంలో మూల విరాటులకు ఏమాత్రం భంగం కలగకుండా అత్యంత జాగరూకతతో ప్రధాన విగ్రహాల్ని తరలించే పనుల్ని దైతపతి సేవాయత్‌ వర్గం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో రత్న వేదికపై నుంచి మూల విరాటులను సురక్షితంగా కిందకు దించే ముందుకు దారు విగ్రహాల ముఖాలు చెక్కుచెదరకుండా భద్రత కల్పిస్తారు. అనంతరం ఒక్కో విగ్రహాన్ని భద్రంగా తరలించేందుకు బాహు కాంటాలు అమర్చుతారు. ఈ సన్నాహాలు జరుగుతుండగా వేదికపై నుంచి కిందకు దించేందుకు వీలుగా చారుమళ్లను అమర్చుతారు. సాయంకాల ధూపం తర్వాత ఈ పనులు ప్రారంభించడం ఆచారం. ఈ సమగ్ర సన్నాహాల్ని దైతపతులు ప్రత్యక్షంగా

పర్యవేక్షిస్తారు. సోమవారం జరగనున్న స్నాన యాత్ర నేపథ్యంలో శనివారం నుంచి ఈ పనుల్ని ప్రారంభించారు. ఇది మొదలుకొని వార్షిక రథ యాత్ర చిట్ట చివరి ఘట్టం నీలాద్రి విజే వరకు జరిగే ప్రక్రియని దైతపతులు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు.

అరుదైన దర్శనం

ఈ యాత్రలో మూల విరాట్లు ప్రత్యేక వస్త్రఽ దారణలో అరుదైన గజానన (హత్తి) అలంకరణలో అశేష భక్త జనానికి దర్శనం కల్పించడం విశేషం. ఈ అలంకరణ సరంజామా స్థానిక రాఘవ దాస్‌ మఠం ఏర్పాటు చేస్తుంది. అలంకరణ కార్యకలాపాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

పటిష్టమైన భద్రత

యాత్ర ఆద్యంతాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. దేవ స్నాన పూర్ణిమ సందర్భంగా భద్రత, ట్రాఫిక్‌, జనసందోహ నియంత్రణ ఏర్పాట్లను సెంట్రల్‌ రేంజ్‌ ఐజీపీ డాక్టర్‌ సత్యజిత్‌ నాయక్‌, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు ప్రతీక్‌ సింగ్‌ సమీక్షించారు. పూరీ పట్టణ వ్యాప్తంగా 79 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లలో పోలీసు సూపరింటెండెంట్‌, కమాండెంట్‌ స్థాయి 15 మంది అధికారులు, 30 మంది డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌, సబ్‌ ఇనస్పెక్టర్‌, సహాయ సబ్‌ ఇనస్పెక్టర్‌ స్థాయి సుమారు 340 మంది అధికారులు ఉంటారు.

సీసీటీవీ నిఘా

నగర వ్యాప్తంగా దాదాపు 200 సీసీటీవీ కెమెరాలు కన్నేసి ఉంటాయి. అదే సమయంలో మఫ్టీ సిబ్బంది, పైకప్పు భద్రతా బృందాలను కూడా మోహరిస్తారు. రత్న వేదికపై నుంచి మూల విరాటుల వరుస క్రమ తరలింపు (పొహొండి), దర్శనం సందర్భంగా జన సందోహం నిర్వహణ, వాహనాల రవాణా నియంత్రణ పట్ల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్నాన యాత్ర సమయంలో దేవతా విగ్రహాలకు అవసరం అయ్యే సుమారు 300 కిలో గ్రాముల బరువైన ప్రత్యేక సంప్రదాయ పట్టు వస్త్రాలు బాసుంగ పట్టొ అఠొగొడొ తిగిరియా నుంచి చేరినట్లు అధికారులు తెలిపారు.

యాత్రికుల కదలిక క్రమబద్ధీకరణ

జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్ర, సుదర్శనుల స్నాన యాత్రకు మారు మూల ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. యాత్రికుల రాకపోకలను నియంత్రించేందుకు శ్రీ జగన్నాథ ఆలయ కార్యాలయం నుంచి మార్కెట్‌ చక్‌ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పహండి కోసం టికెట్లు ఉన్న భక్తులను ఆలయ దక్షిణ ద్వారం ద్వారా లోపలికి అనుమతిస్తారు. సాధారణ భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి దర్శనం కోసం స్నాన మండపానికి చేరి మూల విరాటులను దర్శించుకుని మిగిలిన మూడు ద్వారాల ద్వారా బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు బొడొ దండొ నుంచి స్నాన మండపంపై దేవతా మూర్తులను దర్శించుకోగలరు. అయితే ఉత్సవ ఊరేగింపు సమయంలో బొడొ దండొ వెంబడి మార్గ మధ్యంలో నిలబడటాన్ని అధికారులు నిషేధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement