శ్రీ జగన్నాథుని దర్శనం తాత్కాలికంగా నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

శ్రీ జగన్నాథుని దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

భువనేశ్వర్‌: పూరీ శ్రీ జగన్నాథుని స్నాన యాత్ర సన్నాహాల్లో భాగంగా స్వామి దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్‌ పాఢి శనివారం తెలిపారు. జ్యేష్ట శుక్ల పూర్ణిమ పురస్కరించుకుని జరగనున్న స్నాన యాత్ర సన్నాహాలు శనివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీ మందిరంలో స్వామి దర్శనం లభ్యం కాదని సీఏఓ వివరించారు.

ఒడిశా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా లాల్‌ జీ దేశాయ్‌

భువనేశ్వర్‌: జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చేపట్టిన కీలకమైన సంస్థాగత మార్పుల్లో భాగంగా ఒడిశాకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జిగా సీనియర్‌ నాయకుడు లాల్‌ జీ దేశాయ్‌ నియమితులు అయ్యారు. కాంగ్రెస్‌ సేవా దళ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన లాల్‌ జీ దేశాయ్‌ ఒడిశా ఏఐసీసీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి అజయ్‌ కుమార్‌ లల్లు స్థానంలో నియమితులయ్యారు. ఈ నియామకాలకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆమోదం తెలిపారని పేర్కొంటూ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలో 2000 సంవత్సరం నుండి అధికారానికి దూరంగా ఉన్న పార్టీని పునరుజ్జీవింపజేయడం, భవిష్యత్‌ ఎన్నికల కోసం సన్నద్ధతను పటిష్టం చేయడంపై కాంగ్రెస్‌ దృష్టి సారిస్తున్న తరుణంలో లాల్‌ జీ దేశాయ్‌ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజిలెన్స్‌ వలలో

పశు సంవర్ధక శాఖ ఇన్‌స్పెక్టర్‌

కొరాపుట్‌: విజిలెన్స్‌ వలలో పశు సంవర్ధక శాఖ ఇన్‌స్పెక్టర్‌ చిక్కుకున్నారు. నబరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితికి చెందిన పశు సంవర్ధక శాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రఫుల్ల హల్దార్‌ రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కామధేను పథకం కింద ఒక లబ్ధిదారునికి ఆవులు కొన్నందుకు సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది. ఈ నిధులు మంజూరు చేయడానికి హల్ధర్‌ రు.80 వేలు డిమాండ్‌ చేశారు. దాంతో బాదితుడు విజిలెన్స్‌ శాఖని సంప్రదించాడు. వారిచ్చిన నగదును బాధితుడు హల్ధర్‌ కి అందించాడు. వెంటనే విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని విజిలెన్స్‌ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. హల్ధర్‌ ఇంటిలో సోదాలు జరుపగా లెక్కలు లేని రు.8 లక్షలు నగదు సీజ్‌ చేశారు.

గుమ్మ ఘాటీలో ట్రాలర్‌ బోల్తా

13 గంటలు రాకపొకలు బంద్‌

రాయగడ: సదరు సమితి పరిధిలోని గుమ్మ ఘాట్‌ వద్ద పైపులతో వెళ్తున్న ఒక ట్రాలర్‌ అదుపుతప్పి బోల్తా పడటంతొ జాతీయ రహదారి–326పై రాకపోకలు 13 గంటలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కారణంగా రహదారికి ఇరువైపులా వందలాది బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు అడవి, ఘాట్‌ ప్రాంతంలో రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం.. పైపులలోడ్‌తొ ట్రాలర్‌ రాయగడ నుంచి కొరాపుట్‌ వైపు వెళ్తుండగా అర్ధరాత్రి సమయంలో ఘాట్‌ మలుపు వద్ద డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడింది. దీంతో భారీ ట్రాలర్‌ రహదారిని పూర్తిగా కప్పేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపొయాయి. రాయగడ మీదుగా కొరాపుట్‌, నవరంగపూర్‌ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు ఇటు టికిరి, కాసీపూర్‌ ప్రాంతాలకు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గుమ్మఘాటీ మలుపులో ఇటువంటి తరహా ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడం సాధారణమైపోయింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ ప్రమాదాలు తగ్గేలా రహదారి విస్తరణ, ప్రమాదకర మలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, భద్రత చర్యలు చేపట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొవాలని ప్రభుత్వాన్ని, జాతీయ రహదారి అధికారులను ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement