మోసం చేసిన ప్రియుడు..
భువనేశ్వర్: ప్రేమ వ్యవహారంలో నమ్మించి మోసం చేసిన ప్రియుడికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వైద్య విద్యార్థిని చంద్రిక మృతి కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆమోదంతో ఈ మేరకు చర్యలు చేపట్టడం సంచలనం రేపింది. వైద్య విద్యార్థిని చంద్రికా హేంబ్రమ్, ఓఏఎస్ ట్రెయినీ (ఓటీఏఎస్) అధికారి అయిన భీమ్‌సేన్ టుడు ప్రేమికులు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడంతో కథ అడ్డంగా తిరిగింది. ఆమె నల్లని ఛాయపై కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వేధించినట్లు ఆరోపణ. ఇంతలో మరో యువతితో ప్రేమ వ్యవహారం బయటపడడంతో చంద్రిక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చంద్రిక మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ఓఏఎస్ ట్రైనీ (ఓటీఏఎస్) అధికారి అయిన భీమ్‌సేన్ టుడుని ఓఏఎస్ శిక్షణ సమయంలో పోలీసులు అరెస్టు చేసి న్యాయ స్థానం అనుమతితో సుదీర్ఘంగా విచారణ కొనసాగించడంతో చట్టపరమైన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాస్వతంగా తొలగించారు. భవిష్యత్‌లో అతడిని మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడిగా పరిగణించరు. అరెస్టు తర్వాత భీమ్‌సేన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల అతడిని రిమాండ్‌లోకి తీసుకుని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. క్రిమినల్ కేసులో నిరవధికంగా 48 గంటలకు పైగా పోలీసుల అదుపులో ఉన్నందుకు చట్టం ప్రకారం అతడిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు.
భీమ్‌సేన్‌ను 2 రోజుల రిమాండ్‌కు తీసుకునేందుకు కటక్ ప్రథమ శ్రేణి జుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు (జేఎంఎఫ్‌సీ) అనుమతించింది. త్రికోణ ప్రేమ కారణంగా చంద్రిక మరణం సంభవించిందని పోలీసులు తెలిపారు. ప్రియుడు భీమ్‌సేన్‌ను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తు ప్రక్రియను ముమ్మరం చేశారు. డిజిటల్ సాక్ష్యాల ఆధారంతో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని కటక్ డీసీపీ తెలిపారు. భీమ్‌సేన్ రెండో ప్రియురాలిని త్వరలో విచారించడం జరుగుతుందన్నారు.


