రాయగడ: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన నషా ముక్త అభిజాన్ కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ జిల్లా బడ్మాల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 231 కిలోల 810 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అంత ర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాకు గట్టి ఎదురు దెబ్బకొట్టారు. జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున స్టేట్ హైవే–10లొ ఖేరువాల్ వంతెన సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఎర్టిగా కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులను చూసి వేంగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటాడిన పోలీసులు కొద్ది దూరంలో వాహనం టైరు పగిలిపోవడంతో ఒక నిందితుడు చిక్కాడు. మరో వ్యక్తి పరారాయ్యాడు. అనంతరం ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా 231.810 కిలోల గంజాయి లభ్యమైంది. ప్రాధమిక విచారణలో ఈ గంజాయిని బౌధ్ జిల్లా నుంచి సేకరించి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పుదొవ పట్టించేందుకు వాహనానికి అసలు నంబరు ప్లేట్ తొలగించి ఒడిశా రిజిస్ట్రేషన నంబర్‌ను అమర్చినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఈ కేసులో మధ్యప్రదేశ్‌లోని షహడొల్ జిల్లాకు చెందిన అంకిత్ శర్మ అలియాస్ చొటును అరెస్టు చేసి టోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి గంజాయి రవాణాకు వినియోగించే కారుతో పాటు రెండు మధ్యప్రదేశ్ నంబర్ ప్లేట్లు, బీమా పత్రాలు, ఒక డెబిట్ కార్డు, మోబైల్ ఫోన్, నగదు 1530 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలొ ఉన్న మరో నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


