జయపురం: కొరాపుట్ జిల్లా సమాచార ప్రజాసంబంధాల అధికారి స్వరాజ్ శిశా అకాల మృతికి జయపురం మీడియా ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జయపురంలో శనివారం జరిగిన సంతాప సభలో శిశా మరణం దురదృష్టకరమని నివాళులు అర్పించారు. ఆయన మంచి అధికారి అని జిల్లాలో మీడియ ప్రతినిధులకు అండగా ఉండేవారని గుర్తు చేసు కున్నారు.
చెడు వ్యసనాలతో
జీవితాలు నాశనం
జయపురం: చెడు వ్యసనాలతో జీవితాలు నాశనం అవుతాయని జయపురం అబ్కారీ విభాగ అధికారులు, సిబ్బంది అన్నారు. అంతర్జాతీయ నిషా నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అబ్కారీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కోర్టు కూడలి వద్దకు చేరింది. యువత తాగుడుకు అలవాటు పడి తమ జీవితాలను నష్ట పోతున్నారని, ఈ నిషా నుంచి యువత ముక్తి పొంది శాంతి జీవనం గడపాలని ఉద్భోదించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు అబ్కారీ సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఐ జయంతిలాల్ పాండే, అబ్కారీ ఇన్‌స్పెక్టర్ అజయ్ నాయక్, జయపురం అబ్కారీ విభాగ అధికారి సుబ్రత కిశోర్ హిరన్, బొరిగుమ్మ అబ్కారి అధికారి నీలాద్రి బిహారి మిశ్ర, కొట్‌పాడ్ అబ్కారీ అధికారి బలరాం దాస్, అబ్ ఇన్‌స్పెక్టర్ సోను సెట్టియ, తదితరులు పాల్గొన్నారు.
మానవ సేవే మహోన్నత సేవ
శ్రీకాకుళం కల్చరల్: మానవతా సేవే మహోన్నత సేవ అనే రెడ్‌క్రాస్ సిద్ధాంతాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సర్వసభ్య సమావేశం, పురస్కారాల ప్రదానోత్సవం శనివారం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, వైద్యులు, రక్తదాతలు, దాతలు, సేవా సంస్థలు అందిస్తున్న విశేష సహకారాన్ని అభినందించారు. అంతర్జాతీయ మానవ హక్కుల మండలి కార్యదర్శి ఎం.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో రెడ్‌క్రాస్ సంస్థ పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడారు.


