మదన్మోహనుడి నౌకా విహారం
భువనేశ్వర్: పవిత్ర వైశాఖ శుక్ల పక్షం చతుర్థి పురస్కరించుకుని మంగళవారం రెండో రోజు చందన యాత్ర రమణీయంగా సాగింది. వసుదేవుని శిరస్సున చిన్ని కృష్ణుని అలంకరణ భక్తులను మురిపించింది. ఈ అలంకరణలో నౌకా విహారంతో నరేంద్ర కొలను యమునా నదిని తలపింపజేస్తుందని భక్తజనం ఉత్సాహం కనబరిచారు. శ్రీజగన్నాథ సంస్కృతి భారతీయ సనాతన సంప్రదాయానికి పరాకాష్ట. పూరీ శ్రీమందిరంలో ఏడాది పొడవునా పన్నెండు నెలల పాటు జరుపుకునే పదమూడు యాత్రల్లో గంధలేపన యాత్ర ఒకటి కావడం విశేషం. వాడుక వ్యవహారంలో ఈ యాత్ర చందన యాత్రగా ప్రసిద్ధి. వేసవి తాపం నుంచి ప్రపంచానికి ఉపశమనం కలిగించడానికి శరీరానికి సుగంధ గంధాన్ని పూసుకోవడం, చల్లని కొలనులో పడవ ప్రయాణం చేయడం చందన యాత్రను ప్రతిబింబిస్తుంది. పరోక్షంగా మండు వేసవిలో శరీరానికి సమయోచితంగా పరిరక్షించుకునే జాగ్రత్తల్ని ఈ యాత్ర పేర్కొంటుంది. ఏటా చందన యాత్ర సుదీర్ఘంగా 42 రోజులు కొనసాగుతుంది. తొలిసగం 21 రోజులు వెలుపలి చందన యాత్రగా, మలి 21 రోజులు అంతర్ చందన యాత్రగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు అవసరమైన గంధం శ్రీక్షేత్రంలో పలు మఠాలు సిద్ధం చేస్తాయి. అక్షయ తృతీయ నాటికి సిద్ధం చేసిన గంధం చందన యాత్ర నిర్వాహక యంత్రాంగానికి అందజేస్తారు. గంధం తయారీలో గంధపు చెక్క, కర్పూరం, కేసర్, జాజికాయ మరియు లవంగాలు సుగంధ ద్రవ్యాల్ని మేళవించి సుగంధభరితంగా తయారు చేస్తారు.


