ఇచ్ఛాపురం : ఒడిశా నుంచి బెంగళూరుకు 32 కేజీల గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయగా వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఫుల్‌బాని ప్రాంతం నుంచి 32 కేజీల గంజాయితో కందమాల్ జిల్లాకి చెందిన సుస్మి బెహర, సితయ దలచత్ర, ప్రతిమ బెహర, దులై భోయ్, నిమంత కన్హార్‌లు పట్టుబడ్డారు. వీరిని విచారించగా కందమాల్ జిల్లా తిలారంగి గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి రాధాకాంత దిగల్ అలియాస్ రాధ నుంచి గంజాయిని తీసుకొని బెంగళూరులోని సునీల్‌కు అందజేయడానికి వెళ్తున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐతో పాటు పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది రంజిత్ పాల్గొన్నారు.


