విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
జయపురం: విద్యుదాఘాతంతో మూడు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన జయపురం సమితి బరిణిపుట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పశువుల యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మరణించిన ఆవులను పోస్టుమార్టం జరిపించి వాటిని యజమానికి అప్పగించారు. పశువుల యజమాని బరిణిపుట్ నివాసి టి.జనార్దనరాజు గత రాత్రి తన ఇంటి ఆవరణ నుంచి అకస్మాత్తుగా పశువుల అరుపులు వినిపించాయి. ఇంటిలో ఉన్న రాజు కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. అయితే ఆవుల శాల సమీపంలో ఉన్న 11 కేవీ వోల్టేజ్ స్తంభం నుంచి వైర్లు తెగి పశువల శాలపై ఉన్న టిన్ను రేకులపై పడి ఉన్నాయి. టిన్నులలో విద్యుత్ ప్రసారం జరిగి మూడు ఆవులు దుర్మరణం చెందాయి.
375 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మాన్యంకొండ పంచాయతీలో గుంఠబేఢ గ్రామంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఐఐసీ ప్రభు దత్త విశ్వాల్ ఆదేశాలతో ఓ బృందం పోలీసులు మంగళవారం రాత్రి ఆ గ్రామానికి వెళ్లి దాడి చేశారు. ఈ ఘటనలో ఘసి గోలారీ, మహాదేవ్ మాఝిల ఇళ్లవద్ద రవాణాకు సిద్ధం చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని కలిమెల పోలీసుస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయని బుధవారం తూకం వేయగా 375 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ప్రభు దత్త తెలిపారు.
టీచర్‌కు ఘన నివాళులు
జయపురం: కొద్ది రోజుల కిందట జయపురం సమితి ఉమ్మిరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయిన అంబాగుడ ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకుడు సతీష్ సాహుకు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం సాయంత్ర వారంతా బ్యానర్లు పట్టుకుని, కొవ్వొత్తుల దీపాలు వెలిగించి రాజనగర్ కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వర్గీయ సతీష్ చిత్రపటం వద్ద దీపాలు వెలిగించారు.
కారు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి శిమిలిబాంఛ పంచాయతీ కలాధపల్లి గ్రామం మలుపు వద్ద కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం ఛత్తీస్‌గడ్ రాష్ట్ర దోర్నాపాల్ గ్రామం నుంచి దీపక్ అనే యువకుడు మరోవ్యక్తితో కారులో పోడియ గ్రామానికి వస్తున్నాడు. అయితే కలాధపల్లి వద్ద ఉన్న మలుపు తిరుగుతుండడగా ప్రమాదశాత్తు కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవ్ చేస్తున్న దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పోడియా అగ్నిమాపక అధికారి వీరేంద్రసింగ్ నేతృత్వంలో సిబ్బంది వచ్చి దీపక్‌ను కారులో నుంచి బయటకు తీసి పోడియ ఆరోగ్య కేంద్రానికి తరలించారు చికిత్స అందించారు. అయితే దీపక్ పరిస్థితి విషమంగా ఉంది. పోడియ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి.. కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు.
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి


