జగన్నాథుని ఆభరణాల లెక్కింపునకు రంగం సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రత్నాభరణాల లెక్కింపు, అనుబంధ జాబితా ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు సర్వం సిద్ధమైందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. శ్రీ మందిరంలోని రత్న భాండాగారంలో భద్రపరచాల్సిన ఆభరణాలు ఇతరేతర అమూల్య సంపద లెక్కింపు, జాబితా తయారీ ప్రక్రియ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారం నాటికి ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు శ్రీ మందిరం ఛొత్తీషా నియోగుల వర్గంతో చర్చలు జరిగాయి. తేదీ, సమయాన్ని త్వరలో నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. ఆలయ సంప్రదాయం, ఆచారాల ప్రకారం తేదీ, సమయాన్ని ఆలయ పాలక మండలి నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఆభరణాల జాబితా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి శ్రీ మందిరం పాలక మండలి ప్రతిపాదించిన 14 పేజీల ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)ని ప్రభుత్వం ఆమోదించిందని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాఢి ప్రకటించారు. ఆమోదిత కార్యాచరణ అమలు కోసం ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం పూరీ శ్రీ జగన్నాథ ఆలయం కార్యాలయంలో జరిగింది. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పలువురు అధికారులకు వివిధ బాధ్యతలను కేటాయించారు. ఆభరణాల మూల్యాంకనం ఒక శుభ దినం అమృత ఘడియల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయ రత్న భండార్ యొక్క జాబితా మరియు మూల్యాంకనాన్ని పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం (ఎస్‌జేటీఏ) రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రక్రియలో భాగంగా, ఆలయ పరిపాలన సజావుగా జరిగేలా చూసేందుకు రెండు అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం పర్యవేక్షక కమిటీ, నిర్వహణ కమిటీగా పని చేస్తుంది. రత్నాభరణాల లెక్కింపు, జాబితా రూపకల్పన సమగ్ర ప్రక్రియను పర్యవేక్షక కమిటీ పర్యవేక్షిస్తుంది. రత్న భాండాగారంలో భద్రపరిచే విలువైన ఆభరణాలు, వస్తువుల భౌతిక జాబితా, లెక్కింపు బాధ్యతల్ని నిర్వహణ కమిటీ నిర్వహిస్తుంది. భాండాగారంలో రత్న సంపద జాబితా రూపొందించడంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్ వ్యవహారాల్ని ఈ కమిటీ నిర్ధారిస్తుంది. ఈ సమగ్ర ప్రక్రియ ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ప్రక్రియ 1978 జాబితా ప్రామాణికంగా రత్న భాండాగారంలో ఆభరణాలు తదితర వివరాల్ని పరిగణనలోకి తీసుకుంటుందని సీఏఓ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వార్షిక రథ యాత్ర పురస్కరించుకుని నీలాద్రి విజేకు సుమారు 24 రోజుల ముందు నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుందని పాలక, అధికార వర్గం అభిప్రాయపడుతుంది. ఈ వ్యవధిలో రోజువారీ ఆచారాలు, భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా జాబితా తయారీ సజావుగా కొనసాగుతుందని యోచిస్తున్నారు. ఈ యోచనకు అనుకూలంగా పండితులను సంప్రదించి శుభ దినం, సమయాలను పరిగణనలోకి సుకుని తేదీ వివరాలు త్వరలో ప్రకటిస్తారు.


