జయపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
జయపురం: ఎటువంటి చారిత్రిక ప్రాధాన్యం లేని కొరాపుట్ కన్నా ఎంతో చరిత్ర గల జయపురం జిల్లాగా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. జయపురం కేంద్రం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించిన లేఖను జయపురం సబ్‌కలెక్టర్‌కు సోమవారం సమర్పించారు. కొరాపుట్‌కు జయపురానికి ఉన్న వ్యత్యాసాలను లేఖలో ఆధారాలతో పొందుపరిచారు. కొరాపుట్‌కు ఎటువంటి చరిత్ర లేదని, 1870లో ఆనాటి ఆంగ్లేయులు జయపురం సామ్రాజ్య ప్రాధాన్యతను మరుగున పరచేందుకు కొరాపుట్‌ను ఆశ్రయించారన్నారు. జయపురం 17వ శతాబ్దం నుంచి రాచరికం రద్దు అయి.. 1952 వరకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని వెల్లడించారు. స్వాతంత్య్ర ముందు, తరువాత కాలంలోనూ కొరాపుట్ జిల్లా విభజన జరిగేంత వరకు జయపురం కీలకపాత్ర నిర్వహించిందని వివరించారు. కొరాపుట్ సముద్ర మట్టానికి 880 మీటర్ల ఎత్తులో ఉండగా.. జయపురం 650 మీటర్ల ఎత్తులో ఉందన్నారు. కొరాపుట్ సబ్ డివిజన్ విస్తీర్ణం 5837 స్వేర్ కిలో మీటర్లు కలిగి ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉందన్నారు. జయపురం సబ్‌డివిజన్ 2970 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండి ఛత్తిష్‌గఢ్ రాష్ట్ర సరిహద్దున ఉందన్నారు. జనసంఖ్యలో కొరాపుట్ కన్నా జయపురం ఎక్కువ అని వెల్లడించారు. అవిభక్త కొరాపుట్‌లో జయపురం అతి పెద్ద పట్టణమన్నారు. నల్కో, హాల్ వంటి పరిశ్రమలు కొరాపుట్‌లో నెలకొని ఉండటం వలన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జయపురం సబ్ డివిజన్‌లో ఒక్క పరిశ్రమ కూడా లేక పోవటం వలన ఉద్యోగ అవకాశాలు లేవని, అందువలన జయపురం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. జయపురంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలు కొరాపుట్‌కు తరలించారని, జయపురంలో ప్రతిపాదిత మెడికల్ కళశాలను కొరాపుట్‌లో నెలకొల్పారని ఆరోపించారు. అందువలన జయపురం సబ్‌డివిజన్‌లో నిరుద్యోగం తాండవిస్తూ యువత పలు అక్రమమార్గాలలో పయనిస్తున్నారన్నారు. అందువల్ల జయపురం సబ్‌డివిజన్‌తోపాటు మల్కనగిరి జిల్లాలోని మత్తిలి, గోవిందపల్లి, కొరాపుట్ సబ్‌డివిజన్ లమతాపుట్ సమితి, నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలతో కలపి జయపురం కేంద్రం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


