భార్యను హతమార్చిన భర్త
రాయగడ: కుటుంబ కలహాలతో పడుకుని ఉన్న భార్యను గొడ్డలితో నరికి భర్త హతమార్చిన ఘటన జిల్లాలోని కుంభికోట పోలీస్‌స్టేషన్ పరిధి నకిటి పంచాయతీ ఇర్పిపూట్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలు మాలతి మెలక (51)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రఘు మెలక, మాలతీ మెలకలు భార్యాభర్తలు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి గొడవపడ్డారు. అనంతరం నిద్రలో ఉన్న తన భార్య మాలతి తలపై రఘు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన ఆమె సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. కుటుంబీకులు ఈ విషయమై కుంభికోట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్డీపీవో గౌరహర సాహు, రాయగడ ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరలు చేరుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన మృతురాలి భర్త రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


