గుప్తేశ్వర్‌లో మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో గల ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు గుప్తేశ్వర ఉత్సవ కమిటీ సమావేశమైంది. జయపురం మున్సిపాలిటీ కౌన్సిల్ సభాగృహంలో జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన గుప్తేశ్వర్ మహాశివరాత్రి ఉత్సవాల సన్నాహక సమావేశంలో పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి శాంతి భద్రతల రక్షణకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సబ్ కలెక్టర్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. శివరాత్రి జాగరణ సమయంలో సాయంత్రం 7 నుంచి ప్రధాన గేటు మూసి వేసేందుకు నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకు హరిహర భేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. స్వామి ప్రత్యేక దర్శనం కోసం రూ.500 వసూలు చేయాలని, బస్సు పార్కింగ్ కోసం రూ.100 చార్జీ వసూలు చేయాలని, జయపురం, ఇతర ప్రాంతాల నుంచి గుప్తేశ్వర్ వచ్చే బస్సులలో భక్తుల నుంచి గతంలో లాగనే చార్జీలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శివరాత్రి మూడు దినాలు రాత్రులందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయంచారు. సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జయపురం సబ్‌డిబిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్, జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయిక్, శుభ లక్ష్మీ నాయిక్, ఏఎఫ్‌ఓ సురేష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు.


