సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ఆరోగ్య పథకాలు, అంబులెన్స్ సేవలు ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలకు అందించేందుకు పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎలక్ట్రానిక్, వ్యాపారశాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుసాని సమితి కెరండీ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ల కొరత తీర్చేందుకు పీజీ చదివిన ఎంబీబీఎస్ డాక్టర్లను నియామకాలు జరుపుతామని అన్నారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టరేట్ హాలులో ఉన్నతాధికారులతో వివిధ పథకాలపై సమీక్షించారు. సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహానా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగార్వాల్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, డీహెచ్‌వో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అధికారి పృథ్వీరాజ్ మండళ్ పాల్గొన్నారు. జిల్లాలో సుభద్ర, మంచినీటి పథకాలు గ్రామీణ ప్రాంతాలకు అందించాలని అన్నారు. దీని కోసం మెగా పైప్ లైన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుల ఖాతాల్లో సకాలంలో ధాన్యం సొమ్ములు జమచేయాలని, పీడీఎస్ రైస్ కూడా లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విభిన్న పథకాలు పంపిణీ చేయాలని అన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, రోడ్లు–భవనాల శాఖ ఎస్‌ఈ అభిషేక్ శెట్టి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


