జాతీయస్థాయి తైక్వాండ్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
పర్లాకి మిడి: రాజస్థాన్‌లోని జయపూర్ సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన జాతీయ స్థాయి తైక్వాండ్ మార్షల్ పోటీలలో గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందిన సువర్ణసాహుకు రజత పతకం లభించిందని గజపతి తైక్వాండ్ అకాడమీ అధ్యక్షులు కార్తీక్ మహాపాత్రో తెలిపారు. దేశ వ్యాప్తంగా 1400 మంది తైక్వాండ్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనగా గజపతి జిల్లా నుంచి నలుగురు పోటీ పడ్డారు. వారిలో సువర్ణసాహు రజతం పొందగా, పి.సాయిస్మిత, అనుశ్రిలా మల్లిక్‌కు కాంస్య పతకాలు లభించాయి. వారికి పర్లాకిమడి రైల్వేస్టేషన్ వద్ద ఘనంగా అకాడెమీ సభ్యులు స్వాగతం పలికారు.
ధాన్యం మండీల్లో అవినీతిపై ఫిర్యాదు
జయపురం: జయపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి అభియోగ సునానీ శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరాపుట్ జిల్లా కృషక కళ్యాణ మంచ్ జిల్లాలో నిర్వహిస్తున్న ధాన్యం మండీలపై పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యభాన్ మహోజన అధ్యక్షతన జరిగిన శిబిరంలో కృషక్ కళ్యాణ మంచ్ తరఫున రైతు నరేంద్రకుమార్ ప్రధాన్ పలు వినతులు అందజేశారు. మండీలలో ధాన్యం తూయటం లేదని, ప్రతీ క్వింటాకు ఐదు నుంచి 12 కేజీల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని, హేండిలింగ్ చార్జీలు రైతులకు చెల్లించటం లేదని ఆరోపించారు. అలాగే ఓపీడీఆర్ కేసును వెంటనే పరిష్కరించాలని ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ మహంతి డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. అభియోగ సునానిలో 52 వినతి పత్రాలు జిల్లా కలెక్టర్‌కు ప్రజలు అందజేశారు. వాటిని పరిశీలించిన కలక్టర్ సంబంధిత అధికారులకు అందజేసి వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. శిబిరంలో జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి, ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
దుఃఖాన్ని దిగమింగుతూ..
● భర్త మృతదేహానికి భార్య అంత్యక్రియలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాపువీధిలో భర్త మృతదేహానికి దుఃఖాన్ని దిగమింగుతూనే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాపు వీధికి చెందిన బడబందల అభి(48) కడుపు నొప్పితో బాధపడుతూ అస్పత్రితో చేరి మంగళవారం మృతి చెందారు. భర్త మృతి చెందడంతో అగ్ని సాక్షిగా వేదమంత్రాల నడుమ తాళి కట్టించుకున్న భార్య లక్ష్మి అన్నీతానై పుట్టెడు దుఃఖంలో తన భర్త చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు చేపట్టింది. దివ్వాంగుడైన మృతుడు వాచ్ మెకానిక్ వృత్తిని నమ్ముకొని భార్య, బిడ్డలను పోషించేవాడు. అయితే ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం వీధిన పడిందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.


