సాహసానికి సత్కారం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి 42 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందికి శౌర్య పతకాలు, విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకాలు, ప్రశంసనీయ సేవకు పోలీసు పతకాలు మరియు గవర్నర్ పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఈ పతాక విజేతల్ని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు, అసాధారణ ధైర్యసాహసాలు, అచంచలమైన అంకితభావం మరియు దేశానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవకు నిదర్శనాలను కొనియాడారు. – భువనేశ్వర్
చికిత్సలో డబ్బు ప్రమేయం తగదు
● డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: అనారోగ్యంతో సంప్రదించిన బాధిత వ్యక్తికి డబ్బు ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఉత్తమ చికిత్స చేయాలని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆకాంక్షించారు. హైటెక్ వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుల, మత, వర్గ, వర్ణ విబేధాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో సానుకూలంగా స్పందించి చేయూతనిస్తామని కార్యక్రమానికి హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కోణార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సముదాయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఇతివృత్తంతో ప్రదర్శించిన నృత్య నాటకం ఆకట్టుకుంది. హైటెక్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హైటెక్ క్యాంపస్ నుంచి జాతీయ రహదారి గుండా పండర గ్రామం వీధుల్లో నిర్వహించిన ర్యాలీ గ్రామస్తుల్ని ఆలోచింపజేసింది.


