కమ్మసిగడాం జాతరకు సర్వం సిద్ధం
● నేటి రాత్రి మహాలక్ష్మీ కల్యాణంతో ప్రారంభం
● మూడు రోజుల పాటు నిర్వహణ
రణస్థలం: కమ్మసిగడాం జాతరకు సర్వం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 10.16 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి కల్యాణం అనంతరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలతో పాటు జెయింట్ వీల్స్, కార్, బైక్ విన్యాసాలు, బ్రేక్ డ్యాన్స్‌లు, వస్తు సామాగ్రి, తినుబండారాల స్టాల్స్ సిద్ధం చేస్తున్నారు. యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జే.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. జాతరకు చేరే వాహనాలకు 16 చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. 150 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
● పైడిభీమవరం, కోష్ట వైపు నుంచి వచ్చే వాహనాలు రణస్థలం రాకుండా యూబీ బీరు ఫ్యాక్టరీ పక్క నుంచి కొండములగాం వరకు ఉన్న తోటపల్లి కాలువ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలి.
● నెల్లిమర్ల వైపు నుంచి రణస్థలం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అర్జునవలస నుంచి సంచాం మీదుగా పైడిభీమవరం చేరుకోవాలి.
కమ్మసిగడాం జాతరకు సర్వం సిద్ధం


