ఉన్నత విద్య ప్రతి పేద విద్యార్థికి అందాలి
పర్లాకిమిడి: ఉన్నత విద్య ప్రతి పేద విద్యార్థికి అందాలని కోరుతూ.. కళింగ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్), కళింగ ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ సైన్సెస్ (కిస్) యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఆదివారం మినీ మారథాన్ రన్‌ను రాష్ట్రపతి ఆవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు బినోద్ జెన్నా ఎస్.కె.సి.జి (స్వయం ప్రతిపత్తి)కళాశాల నుంచి ప్రారంభించారు. మినీ మారథన్ కాలేజ్ జంక్షన్ నుంచి గజపతి స్టేడియం వరకు సాగింది. ఈ మారథాన్‌లో రోజానీ బర్దన్, అర్చనా నాయక్, గిరిధర్ రైకా (కిస్ విద్యాసంస్థ), ఉదిత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజపతి స్టేడియంలో జరిగిన సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవా నందనాయక్, కిట్ విశ్వవిద్యాలయం జిల్లా కోఆర్డినేటరు ఉదిత్ కుమార్ సింగ్ ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. కిట్, కిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అచ్చుత సామంత్ అనేక మంది గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తున్నారని, అందరికీ ఉన్నత విద్య చేరాలన్న లక్ష్యంతో కిస్ విద్యాసంస్థ భువనేశ్వర్‌లో స్థాపించారన్నారు. గిరిజన విద్యార్థులు గజపతి జిల్లా నుంచి పదుల సంఖ్యలో ఎంపికై భువనేశ్వర్‌లో కిస్ వర్సిటీలో చదువుతూ దేశ, అంతర్జాతీయంగా ఎదుగుతున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కిట్ వర్సిటీ అబ్జర్వర్ రాజు కుమార్ నాయక్ అతిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.


