రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సొమవారం జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుడిని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ఛాపూర్ పంచాయతీలోని నాగజొరి గ్రామానికి చెందిన పులేన్ ప్రస్కా (23)గా గుర్తించారు. సైకిల్‌పై కర్రలను తీసుకువెళుతున్న యువకుడి మీదుగా ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. దీంతో సంఘటన స్థలం వద్దే ప్రస్కా మృతి చెందాడు. డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైంని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


