
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
పర్లాకిమిడి: దుబాయి, అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగాలు కల్పిస్తానని లక్షలాది రూపాయలు కాజేసిన మెళియాపుట్టి మండలం రట్టిణి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పాత్రోను బుధవారం రాత్రి ఆదర్శపోలీసు స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదర్శపోలీసు ష్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సరిహద్దులోగల మెళియాపుట్టి మండలం రట్టిణి గ్రామానికిచెందిన లక్ష్మీనారాయణ పాత్రో కొంతకాలంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల నుంచి రూ.రెండున్నర లక్షల వరకు తీసుకున్నాడని గుసాని సమితికి చెందిన అమర గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం లక్ష్మీనారాయణ పాత్రో కొందరి వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు సేకరిస్తుండగా.. కొందరు యువకులు పర్లాకిమిడిలో ఫలానా స్థలం వద్దకు రావాలని కోరారు. సరిగ్గా పోలీసు స్టేషన్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత ఐఐసీ ప్రశాంత్ భూపతికి పాత్రోను అప్పగించారు. గజపతి జిల్లాలోనే కాకుండా పలాస మండలంలోని పెద్దవీధి గ్రామానికి చెందిన కొన్ని జోగారావు, గుసాని సమితి డాలింబాపూర్ గ్రామానికి చెందిన రెల్ల భీమారావు, ముంబై, విశాఖపట్నం తదితరుల వద్ద నుంచి కూడా ఇలాగే డబ్బులు కాజేశాడని ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలిపారు. లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎనిమిది ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. నిందితుడికి ముంబై, కాశ్మీర్ వరకూ ఏజెంట్లు ఉన్నట్టు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ పాత్రో పాస్‌పోర్టు, బ్యాంకు అకౌంట్‌ను నిలిపి వేసినట్టు అభ్యర్థులులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నట్టు ఆదర్శపోలీసు ష్టేషన్ ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలియజేశారు.