
పాత దేవాలయాలపై దృష్టి: న్యాయ శాఖ మంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఆచారబద్ధంగా నిత్య, దైనందిన పూజాదుల నిర్వహణ, పరిరక్షణ పటిష్టంగా కొనసాగించాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధికారులకు ఆదేశించారు. ఆయన అధ్యక్షతన స్థానిక లోక్ సేవా భవన్ సముదాయంలో న్యాయ శాఖ సమావేశం గదిలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దేవాలయాల క్రమబద్ధమైన ఆచారాలు, పాత దేవాలయాల మెరుగుదల, సంరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు వివిధ ప్రాంతాలను సందర్శించి రాష్ట్రంలోని పాత దేవాలయాల స్థితి గురించి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషన్ వెబ్‌సైట్ ఆధునికీకరణ చేపట్టి పూర్తి వివరాలతో అవసరమైన సమాచారాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. దేవదాయ, ప్రైవేట్ యాజమాన్యంలోని దేవాలయాల్లో నిత్య, దైనందిన, వార్షిక ఉత్సవాదుల క్రమబద్ధీకరణ, ఆలయ నిర్వహణకు ప్రత్యేక గ్రాంట్లు, సర్టిఫికెట్ల మంజూరు, ట్రస్ట్ బోర్డు విధులు, బాధ్యతలపై అధికార వర్గాలు నిరంతరం పరిశీలిస్తారు. ఓహెచ్‌ఆర్‌ఈ చట్టం 1951 నిబంధనల ప్రకారం హిందూ మత సంస్థల ఉత్తమ నిర్వహణ, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ విధులు, ప్రభుత్వ పనులను త్వరితంగా నిర్వహించడానికి కొత్త నియామకాలు వంటి అంశాలు చర్చించారు. ఈ క్రమంలో సుపరిపాలన, పారదర్శకత, డిజిటల్ పురోగతికి ప్రాధాన్యతనిస్తూ అన్ని పనులను సకాలంలో నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మత సంస్థల అభివృద్ధి కోసం నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని శాఖా అధికారులకు సూచించారు. సమావేశంలో, న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మానస్ రంజన్ బారిక్, దేవాదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెనా, ప్రత్యేక కార్యదర్శి ప్రణబ్ కుమార్ పాత్రో, అదనపు కార్యదర్శి శివ ప్రసాద్ మహాపాత్రో, భగవాన్ ప్రసాద్ సాహు, దేవాదాయ శాఖ పలువురు అధికారులు పాల్గొన్నారు.