● మహామహుల భేటీ
● తెర వెనక వ్యూహాలు
భువనేశ్వర్:
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ విజయోత్సవం వెంబడి మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావించారు. ఈ మేరకు ఇంత వరకు ఎలాంటి చర్యలు స్పష్టం కాలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ బిగుసుకుంది. మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ కంటే కొంత మంది సిట్టింగుల తొలగింపు, మరి కొంత మందికి శాఖల మార్పు, ఇంకొంత మందికి బహుళ శాఖల బాధ్యతల నుంచి ఉపశమనం దిశలో కొత్త మంత్రి వర్గం విస్తరణ రూపు రేఖలు దిద్దుకుంటుందనే ఊహాగానాలు బలంగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖాళీ మంత్రి పదవుల భర్తీతో మార్పు చేర్పులకు అనుగుణంగా కొత్త ముఖాల ఎంపిక కసరత్తులో పార్టీ అధిష్టానం తలమునకలై ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా మంత్రి మండలి విస్తరణలో గవర్నర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించే సంకేతాలు తారసపడుతున్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు, కార్యాచరణ వంటి వ్యవహారాల్లో ప్రత్యక్షంగా చొరవ కల్పించుకుని క్షేత్ర స్థాయిలో సందర్శనలో చురుగ్గా పాలుపంచుకున్నారు. తదనంతరం పలువురు మంత్రులతో ముఖాముఖి సంప్రదింపులు విభిన్న శైలిలో కొనసాగాయి. కొంత మంది మంత్రుల ఇళ్లకు వెళ్లి గవర్నర్ కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, న్యాయ శాఖ మంత్రి తదితర కీలకమైన వారు ఉన్నారు. రాష్ట్రంలో ఈ సంప్రదింపులు ముగిసిన తర్వాత గవర్నర్ న్యూ ఢిల్లీ కూడా సందర్శించారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి వ్యూహకర్తలతో గవర్నర్ భేటీ అయ్యారు. మరో వైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తదితర ప్రముఖులు ఢిల్లీ పర్యటించి రోజుల తరబడి డేరా వేసి పలువురితో సంప్రదింపులు, సమావేశాలు జరిపారు. ఢిల్లీ, భువనేశ్వర్‌లో జరిగిన ఉన్నత స్థాయి బీజేపీ సమావేశాల మధ్య రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పనిలో పనిగా దీర్ఘకాలంగా ఖాళీ అయిన కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తదితర స్థాయిలో చైర్మన్ వంటి ప్రముఖ పదవుల భర్తీ పూర్తి కానుంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సంప్రదింపులు, సమావేశాల్లో అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం అయి ఉంటుందనే ఆశావాదం కొనసాగుతుంది. రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో మంత్రులు, పార్టీ ప్రముఖులతో ప్రత్యక్షంగా సమావేశం కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రతిష్టాత్మక సాహితీ, సాంస్కృతిక, సామాజిక వర్గాలతో సమావేశం కావడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గవర్నర్ పర్యటనలు, సందర్శనలు, సమావేశాలు అధికారికంగా రాష్ట్ర వ్యవహారాలతో ముడిపడి లేనప్పటికీ రాష్ట్రంలో నెలకొని ఉన్న వర్ధమాన పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక చురుకుదనం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. గత నెల 21న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం, గవర్నర్ న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారిని రాజ్ భవన్‌లో కలిశారు. ఇదంతా పూర్తి కావడంతో న్యూ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో ఆరి తేరి భారతీయ జనతా పార్టీ దృష్టిలో పటిష్టమైన వ్యూహకర్తగా వెలుగొందుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. ఈ సమగ్ర సమావేశాల్లో రాష్ట్రంలో సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి దిశలో చర్చలు సాగినట్లు మాత్రమే స్పష్టం అయింది. రాజకీయపరమైన చర్చలు, సంప్రదింపులకు సంబంధించి గోప్యత కొనసాగుతుంది. పశ్చిమ ఒడిశా నుంచి భారతీయ జనతా పార్టీలో రాజకీయ దక్షత కలిగిన రాజ వంశీకుడు, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ ఢిల్లీలో పర్యటించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బి. ఎల్. సంతోష్‌ను కలిశారు. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యతతో ముడిపడిందిగా చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ విజయ్‌పాల్ సింగ్ తోమర్, వంటి ప్రముఖులతో గోప్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అత్యంత బలమైన మంత్రి మండలి తెరపైకి రానుందని ఊహిస్తున్నారు. మంత్రి మండలి విస్తరణ రేపో మాపో అన్న దశకు చేరుకుంది. ఈ సమయంలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు ఎవరి తరహాలో వారు తమ ఉనికిని రాజకీయంగా ప్రతిబింబించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. అటు ముఖ్యమంత్రితో ఇటు పార్టీ, ప్రభుత్వంలో పరపతి కలిగిన నాయకులతో ఆశావాదులు దక్షత, సమర్థత ప్రదర్శనకు పదును పెడుతున్నారు. పదవుల్ని కాపాడుకోవడంలో పలువురు సిట్టింగులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణం, పౌర సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గిరిజన సంక్షేమం, వాణిజ్య, రవాణా, పాఠశాలలు, సామూహిక, ఉన్నత విద్యా విభాగాల పని తీరు ప్రజల ఆశల్ని నీరుగార్చినట్లు విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బలపరచిన విశ్వాసం తాజా సంఘటనలతో పూర్తిగా నీరు గారి పోయింది. మంత్రి వర్గ విస్తరణ పురస్కరించుకుని పాలనలో భారీ సంస్కరణ దిశలో కొత్త ముఖాలకు పట్టం గట్టే అవకాశంపై విశ్లేషకులు గురి పెట్టారు.
మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ
మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ
మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ
మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ
మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ