
75 లక్షల మొక్కలు నాటుతాం: సీఎం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం రెండో విడత కింద 75 లక్షల మొక్కలను నాటనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన మంత్రి చేసిన కృషికి కృతజ్ఞతగా ప్రధాన మంత్రికి జన్మ దిన కానుకగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం రెండో విడత రాష్ట్రం అంతటా 7.5 కోట్ల చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 17న రికార్డు స్థాయిలో ఒకే రోజున 75 లక్షల మొక్కలను నాటాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హరిత కానుకగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అటవీ, వ్యవసాయ శాఖలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తాయి. ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజారోగ్య సంస్థలు మరియు యువజన సంఘాలు మద్దతుగా పాల్గొంటాయి. స్థానిక వాతావరణం, మట్టి సారం ఆధారంగా సిఫార్సు చేసిన వేప, రావి, మర్రి, ఉసిరి, పనస వంటి పలు జాతుల మొక్కలు నాటుతారు.