మల్కన్‌గిరి : చిత్రకొండ సమితి పాప్పరమేట్ల పంచాయతీ లిమాతాంగ్ గ్రామంలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందని తెలిసి వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హోంగార్డు దేవేంద్ర రౌత్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మల్కన్‌గిరి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి
రాయగడ: విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లాలో గల అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే కార్యక్రమాన్ని స్వాగతిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ సిబ్బంది ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ చంద్ర నాహక్ నేతృత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, క్లస్టర్ కన్వీనర్లు, విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో.. 5 నుంచి 6 ఏళ్ల లోపు గల పిల్లలకు బడికి పంపించాలని ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోగా ప్రతీ ప్రాంతంలో ఈ ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నహాలు చేసింది. ఐదేళ్ల ప్రాయం గల పిల్లలకు నర్సరీలో, ఆరేళ్ల పిల్లలకు ఒకటో తరగతిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు పాఠశాలల్లో పేర్లును నమోదు చేయించుకోవాలని పిలుపునిస్తున్నారు.
నేత్రదానం స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని విశాఖ– ఏ కాలనీలో నివాసముంటున్న పొట్నూ రు ధర్మరాజు(71) మృతి చెందడంతో ఆయన కుమారుడు పి.వెంకటరమణ, కుమార్తె ఎ.ప్రవీణ, అల్లుడు రమణమూర్తి నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్ ప్రతినిధి తవుడు ద్వారా విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావుకు తెలియజేయగా నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి సుజాత, పి.సునీతలు హాజరై ధర్మరాజు కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్ అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు.
అదనపు వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ సరఫరా సమయంలో సిబ్బంది అధిక మొత్తం వసూళ్లు చేస్తే పౌర సర ఫరా అధికారులకు ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజె న్సీ నుంచి వినియోగదారులు ఇంటికి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటే రవాణా చార్జి నిమిత్తం ఒక్కో సిలిండర్‌కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. 15 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
పేకాట శిబిరంపై దాడి
కవిటి: మండలంలోని మాణిక్యపురం సమీప కొబ్బరితోట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడిచేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.8600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
యోగా అవార్డులకు
దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం (ఆయుష్ శాఖ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్‌శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత విభాగంలో దరఖాస్తుదారుకు కనీస వయసు 40 ఏళ్లు ఉండాలని, 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నాలు గు అవార్డులను జూన్ 21న ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31తో దరఖాస్తు నమోదు గడువు ముగుస్తుందని తెలిపారు.
హోంగార్డుపై రాళ్లదాడి