పర్లాకిమిడిలో దొంగల ఆటకట్టు
● కేసులు ఛేదించామని ఎస్పీ వెల్లడి
● ఇద్దరు దొంగల పట్టివేత
పర్లాకిమిడి: గత నాలుగైదు నెలలుగా తాళాలు వేసి ఊరికి పోయిన ఇళ్లనే టార్గెట్‌గా చేసి వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను ఎట్టకేలకు పర్లాకిమిడి, గురండి పోలీసు బృందం పట్టుకున్నారు. స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. టాటా విద్యుత్ బోర్డు కంపెనీ మీటర్ రీడర్ దుర్గాప్రసాద్ బెనియా (28) కండ్ర వీధి, (పర్లాకిమిడి), కండ్రవీధికి చెందిన దేవమండళ్ (35) ఈ దొంగతనాలకు పాల్పడ్డారని, వారి వద్ద నుంచి 10 తులాల బంగారం వస్తువులు, రూ.25 లక్షలు విలువ చేసిన పది కిలోల వెండి పట్టీలు, నగదు రూ. 33 వేలు, అమెరికన్ కరెన్సీ 100, 20, 10 డాలర్లు, శ్రీలంక కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరులకు తెలియజేశారు. విద్యుత్ మీటర్ రీడింగుకని వచ్చి తాళలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి, పక్కాగా రెక్కీ వేసి రాత్రిళ్లు దొంగతనాలు చేసి బంగారం, వెండి వస్తువులు కొట్టేసి ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జల్సాగా వాహనాలు కొని తిరగటం వీరి పని అని తెలిపారు.
పోలీసులు ఎలా కనిపెట్టారంటే...
తొలుత మాజీ పోలీసు ఐజీ ఆర్‌కే పాడి ఇంటిలో డిసెంబరు 23న సాయంత్రం 8గంటల సమయంలో ఎస్‌కేసీజీ కళాశాల హాస్టల్ నుంచి వారి ఇంట్లోకి జొరబడినప్పుడు సీసీ కెమెరాలకు దొరికారు. వారి ఫొటోల ద్వారా మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి టెక్నాలజీ ఉపయోగించి వారిని పట్టుకున్నట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. స్థానిక ఆరోగ్యవీధిలో గత ఏడాది జూన్ 22న ఎస్.సందీప్ అనే వెండి నగల టోకు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని, కోమటి వీధిలో వ్యాపారి కోరాడ నారాయణ ఇంటిలో డిసెంబరు 27న దొంగతనాలకు పాల్పడ్డారని, గురండి పీఎస్ పరిధిలో ఎంఎన్ పేటలో టి.లవకుమార్ ఇంటిలో జరిగిన దొంగతనంలోనూ వీరే నిందితులుగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరి వద్ద 3 లక్షల ఖరీదైన హార్డీలీ డేవిడ్ సన్ మోటారు సైకిల్, ఒక స్కూటీ, రెండు మొబైళ్లు, లాకర్‌లు తెరిచే ఇనుపరాడ్డు, నల్లటి ముసుగులు స్వాధీనం చేసుకుని ఆదివారం నిందితుల్ని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అపరిచితుల పంట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రెస్‌మీట్‌లో డీఎస్పీ అమితాబ్ పండా, ఎస్‌డీపీఓ మాధవానంద నాయక్, ఐఐసీ పర్లాకిమిడి ప్రశాంత భూపతి, గురండి ఐఐసీ ఓం నారాయణ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో దొంగల ఆటకట్టు
పర్లాకిమిడిలో దొంగల ఆటకట్టు
పర్లాకిమిడిలో దొంగల ఆటకట్టు


