పులిచర్మాల కేసులో.. ఆరుగురికి జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

పులిచర్మాల కేసులో.. ఆరుగురికి జైలు శిక్ష

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

● గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి

రాయగడ: పులి చర్మాల సగ్లింగ్‌ కేసులో విచారించిన సీజేఎం అపర్ణా మహాపాత్రో ఆరుగురు నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేని పక్షంలో నిందితులు అదనంగా మరో 8 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర పిడిక, అక్షయ కుమార్‌ ఒడియా, సింహాచల్‌ సబర్‌, నిఖిల్‌ గంట, హలధర్‌ సబర్‌, సంగాన కడ్రకలు 2024 మే 9వ తేదీన పులిచర్మాల విక్రయ కేసులో అరెస్టయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం 8 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ మేరకు తుది తీర్పును సీజేఎం వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరి మృతి

రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల రాణిపిండ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు పెడిగుడ గ్రామానికి చెందిన బలిష్ట దిశారి (35)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అంబొదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృదేహాన్ని పోస్టుమార్టం కోసం మునిగుడ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అంబొదలలో కొనసాగుతున్న అమ్మవారి పండగను చూసి ఇంటికి సైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడు సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

6 గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

రాయగడ: వంటగ్యాస్‌ కృత్రిమ కొరత నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక స్క్వాడ్‌ బుధవారం ఆకస్మిక దాడులను నిర్వహించింది. పట్టణంలోని వివిధ హోటళ్లలో నిర్వహించిన దాడులో ఆరు గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నియమాలకు విరుద్ధంగా డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాడులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అదనపు తహసీల్దార్‌ దేవాశీస్‌ బిశ్వాస్‌ నేతృత్వంలో సమితి, మున్సిపాలిటీ పరిధిలోని పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్లు మానవ్‌ రంజన్‌ సున, మహేద్ర రాయక్‌లు దాడుల్లో పాల్గొన్నారు. ఈ బృందం పట్టణంలోని 16 ప్రాంతాల్లొ నిర్వహించిన దాడుల్లో భాగంగా స్థానిక అభిరుచి హోటల్‌ నుంచి రెండు, హోటల్‌ గుండిచా నుంచి మూడు, హోటల్‌ జగన్నాథ్‌ నుంచి ఒక సిలండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

జన గణనలో అందరూ పాల్గొనాలి

భువనేశ్వర్‌: సమ్మిళిత వృద్ధికి దోహదపడే జన గణనలో ప్రజలందరూ పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం తన స్వీయ గణనను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతీ ఇంటినీ లెక్కించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యమైన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో భాగంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్‌ స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉదాహరణగా నిలిచారు. ఇతరులు కూడా అలాగే చేయాలని ప్రోత్సహించారు. జనాభా గణన అభివృద్ధికి పునాది వేసే సమర్థవంతమైన ప్రణాళిక అన్నారు. ప్రస్తుతం ఇళ్ల జాబితా దశ కొనసాగుతుంది. ఈ లెక్కింపులో ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం ప్రాతినిధ్యం లేకుండా మిగిలిపోకుండా ఉండేందుకు పౌరులు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సేవా భవన్‌లో స్వీయ గణన కార్యక్రమానికి ఒడిశా జనగణన కార్యకలాపాల డైరెక్టర్‌ నిఖిల్‌ పవన్‌ కల్యాణ్‌, భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్‌ చంచల్‌ రాణా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement