పర్లాకిమిడి: రాష్ట్ర అవతరణలో పర్లాకిమిడికి ప్రత్యేక స్థానం ఉందని జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అన్నారు. మహారాజా క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విశేష కృషి జరిపి బ్రిటీష్ వారితో పోరాడి ఉత్కళ రాష్ట్రాన్ని భారత స్వాతంత్య్రానికి పూర్వమే సాధించారని కొనియాడారు. జిల్లా స్థాయి ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, డీఎఫ్‌వో కె.నాగరాజు గౌరవ అతిథిగా జిల్లా పరిషత్తు సీడీవో దయామయ పాఢి, ఆదనపు కార్యనిర్వాహణాధికారి ఫృథ్వీరాజ్ మండళ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక సంఘం ఈవో లక్ష్మణముర్ములు విచ్చేశారు. తొలుత ఉత్కళ రాష్ట్ర వైతాళికులు, త్యాగమూర్తులు పర్లాకిమిడి మహారాజా గజపతి, మధుసూదన్ దాస్, పండిత గోపబంధుదాస్, గంగాధర్ మెహార్, మధుసూదన్ దాస్ తదితరుల చిత్రపటాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒడిశాలో దేశంలో లేని వివిధ సంస్కృతులు, కళా, ఆదివాసీ సంప్రదాయం, ప్రత్యేక మందిరాలు ఉన్నాయన్నారు. ఒడిశా రాష్ట్రం ఏర్పడి 2036 సంవత్సరానికి వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి మోహాన్ చరణ్‌మఝి వికసిత్ ఒడిశా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారని కలెక్టర్ అగార్వాల్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన వక్తృత్వ, డ్రాయింగ్, రచన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.


