విజయనగరం క్రైమ్: సైబర్ నేరాలను అరికట్టేందుకు, కేసుల దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వివిధ పోలీస్స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది.రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి సిబ్బంది మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను ఛేదించడంలో సమర్థవంతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా శాఖలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నారు.
బాధితులు వెంటనే ఫోన్ చేయాలి
సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. నేరం జరిగిన తీరును తెలుసుకుని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేట్‌మెంటును పరిశీలించి, నేరానికి పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడి నుంచి ఇంకేమైనా అకౌంట్స్‌కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పేర్కొన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్‌లో ఫిర్యాదు దారు 1930కు రిపోర్టు చేస్తే, సైబర్ మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుత్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్షణలో సైబర్ అండ్ సోషల్ మీడియా సెల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, కంప్యూటర్ నిపుణులు రామరాజు, కె.ప్రసాద్, జగదీష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలి
నేరాలు ఛేదించేందుకు నైపుణ్యం
మెరుగుపర్చుకోవాలి
జిల్లా పోలీస్ కార్యాలయంలో
కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ