
అల్లర్లపై దర్యాప్తునకు సిట్
భువనేశ్వర్: గంజాం జిల్లా ఖల్లికోట్ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఎన్నికల హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ విచారకర ఘటనలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేశారు. సరైన సాక్ష్యాలను (వైజ్ఞానిక, ఫోరెన్సిక్, డిజిటల్) సేకరించి 30 రోజుల్లో ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్ ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికను దక్షిణ ప్రాంతీయ ఇన్‌స్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీస్‌కి దాఖలు చేస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఖల్లికోట్ ముందస్తు ఎన్నికల హింసాత్మక సంఘటనల దృష్ట్యా, ఎన్నికల సమయంలో గంజాం జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ శర్మ శుక్రవారం నుండి ఈ నెల 21 వరకు ఛత్రపురంలో క్యాంప్ చేయనున్నారు.
● కార్యకర్తల ఘర్షణ
రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఖల్లికోట్ పోలీసు ఠాణా పరిధిలోని శ్రీకృష్ణశరణ్‌పూర్ గ్రామంలో బుధవారం రెండు వర్గాల రాజకీయ కార్యకర్తల మధ్య ఘర్షణ ప్రాణాంతకంగా మారింది. బీజేపీ కార్యకర్త మృతి చెందగా, మరో 3 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో అదే గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ పహాన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీజేడీ కార్యకర్తల అసంతృప్తివాదంతో ఈ వివాదానికి ప్రేరణగా భావిస్తున్నారు. ఆశించిన మేరకు బీజేడీ టికెటు లభించకపోవడంతో రెండుగా చీలిన వర్గాల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. అయితే ఖల్లికోట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి చెందిన వర్గం ఇటీవల బీజేపీలో చేరారని అనుబంధ వర్గాలు తెలిపాయి. అనంతరం దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖల్లికోట్ పోలీస్‌స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఖల్లికోట్, భువనేశ్వర్ మధ్య రోడ్లను దిగ్భందించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా హింసాకాండ నేపథ్యంలో మే 20న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు గంజాం జిల్లాలో 20 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొలొ ఆదేశించారు.
30 రోజుల్లో చార్జిషీట్‌కు ఆదేశాలు