మళ్లీ వరదొస్తే!
రూ.15 కోట్ల విలువైన భూమిపై హాంఫట్!
యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలకు అడ్డేది?
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల క్రితం బుడమేరు సృష్టించిన వరద బీభత్సం నగర ప్రజల కళ్ల ఎదుట ఇంకా కదులుతూనే ఉంది. మూడు రోజుల పాటు తుపాను వచ్చినా.. కాస్త గట్టిగా వర్షం పడినా రోడ్లపై చేరుతున్న నీటిని చూసి ఇప్పటికీ నగర ప్రజలు కలవరానికి గురవుతూనే ఉన్నారు. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని బుడమేరు పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం ఇప్పటికీ మొద్దు నిద్ర వీడటం లేదు. వరదల సమయంలో బుడమేరు వరదలకు కారణమైన ఆక్రమణలను తొలగిస్తామని, కాలువను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జారీ చేసిన ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. బుడమేరులో ఆక్రమణలను తొలగించడం మాట అటుంచితే.. కొత్తగా జరుగుతున్న ఆక్రమణలను సైతం అడ్డుకోలేని దుస్థితిలో అధికార యంత్రాంగం మునిగిపోయింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బుడమేరు కాలువలో అడుగడుగునా ఆక్రమణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అయోధ్యనగర్ నుంచి న్యూరాజరాజేశ్వరి పేట మీదుగా వెళ్లే మార్గంలో బుడమేరు కాలువలోని భూమిని భారీ స్థాయిలో పూడ్చివేస్తూ ఆక్రమిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దాదాపు అర ఎకరానికి పైగా విస్తీర్ణంలో బుడమేరు కాలువ భూమిని పూడ్చివేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
బుడమేరు వరదల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలువ ఆక్రమణలను తొలగించి ప్రక్షాళన చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ప్రకటించారు. అయితే ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు. విజయవాడ నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ విభాగ అధికారులు సమన్వయంతో పనిచేసి బుడమేరు పరిధిలోని ఆక్రమణలను గుర్తించాల్సి ఉంది. కాలువ అసలు విస్తీర్ణాన్ని సర్వే చేసి హద్దులను నిర్ధారించాలి. కొత్తగా జరుగుతున్న పూడ్చివేత పనులను తక్షణమే పరిశీలించి ఆ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి.
గత బుడమేరు వరదల్లో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేల కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. నిరుపేదల ప్రాణాలన్నా.. సామాన్యుల ఆర్తనాదాలన్నా ఈ ప్రభుత్వానికి అసలు విలువే లేదా అనే సందేహం కలుగుతోంది. అయోధ్యనగర్ నుంచి న్యూ రాజరాజేశ్వరి పేట వరకు జరుగుతున్న ఆక్రమణలతో పాటు రామకృష్ణాపురం, దేవీనగర్, ఇందిరానాయక్‌నగర్, న్యూరాజరాజేశ్వరీపేట, సన్‌సిటీ కాలనీ, భారతమాతమందిరం రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న బుడమేరు ఆక్రణమలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, కాలువ భూములను సర్వే చేసి, అక్రమ పూడ్చివేతలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. బుడమేరుకు రక్షణగా కంచెను ఏర్పాటుచేసి మరోసారి బుడమేరు వరదలకు ప్రజలు బలికాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయోధ్యనగర్ నుంచి న్యూ ఆర్‌ఆర్
పేటకు వెళ్లే దారిలో కాలువ మాయం
అర ఎకరానికి పైగా
బుడమేరు భూమి కబ్జా
మార్కెట్ విలువ రూ.15 కోట్లకు
పైమాటే!
చోద్యం చూస్తున్న నగరపాలక,
ఇరిగేషన్ అధికారులు
బుడమేరు అనేది కేవలం ఒక కాలువ కాదు.. విజయవాడ నగరానికి వరద ముప్పు నుంచి రక్షణ కల్పించే కీలకమైన జలమార్గం. దాని ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడితే పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ఇప్పటికే బుడమేరు వరదలు గట్టిగా చెప్పాయి. ఆ తీవ్రతను కళ్లారా చూసిన నగర ప్రజలు బుడమేరులో జరుగుతున్న ఆక్రమణలు చూసి మరోసారి అలాంటి విపత్తు వస్తుందేమోనని భయాందోళన చెందుతున్నారు. కాలువను పూడ్చివేసి కబ్జాలకు పాల్పడడం వల్ల నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయి వరదలు సంభవిస్తున్నాయని.. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది మాలాంటి సామాన్య ప్రజలే తప్ప ఆక్రమణలకు పాల్పడే కబ్జాదారులు, వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించే అధికారులు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్యనగర్ ప్రధాన రహదారి వెంబడి గజం స్థలం ధర రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ పలుకుతోంది. ఇక్కడ సుమారు 2,500 గజాల విస్తీర్ణం ఆక్రమణకు గురవుతోంది. అంటే ఆ భూమి మార్కెట్ విలువ రూ.13కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు కూడా దాటే అవకాశం ఉంది. ఇంతటి విలువైన ప్రభుత్వ కాలువ భూమి పూడ్చివేతకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత గల అధికారులెవరూ కనుచూపు మేరల్లో కనపడకపోవడం విడ్డూరం. బుడమేరు సరిహద్దులను గుర్తించి రక్షించాల్సిన అధికారుల్లో కొందరూ ఈ ఆక్రమణల వెనుక చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధికి వీర విధేయతను చూపుతూ.. మరో టీఎన్‌టీయూసీ నాయకుడికి కొమ్ముకాస్తూ లక్షల రూపాయల ముడుపులు తీసుకొని బుడమేరు కనుమరుగుకు కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖల్లోని పలువురు అధికారులు ప్రధాన పాత్రను పోషిస్తున్నారే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


