గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఇదే స్ఫూర్తితో రెండు, మూడో విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలు, కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన జాప్యం, తదుపరి విడతల్లో చేపట్టాల్సిన మెరుగైన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
లోపాలు అధిగమించాలి..
పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను 15 నిమిషాల్లోపు సీల్ చేసి, భద్రతా నిబంధనల మేరకు లెక్కింపు కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి విడతలో కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్, స్టాట్యూటరీ ఫారాల పూర్తి చేయడంలో జాప్యం కారణంగా మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ఆలస్యమైందని పేర్కొన్నారు. తదుపరి విడతల్లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, అవసరమైన ఫారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి తగిన శిక్షణ అందించి కౌంటింగ్ ప్రక్రియను నిర్ణీత సమయానికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా కనీసం 10 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్డుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి లేదా రెండు రౌండ్లలోనే లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓటింగ్ సమయంలో చెల్లని ఓట్ల నమోదు తగ్గించేందుకు, అధికారులు కొత్తగా సరఫరా చేసిన స్వస్తిక్ స్టాంపులను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


