30 లడ్డూలకు బదులు 28 లడ్డూలు | - | Sakshi
Sakshi News home page

30 లడ్డూలకు బదులు 28 లడ్డూలు

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

30 లడ్డూలకు బదులు 28 లడ్డూలు

దుర్గగుడి ఈవోకు భక్తుడి ఫిర్యాదు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కొనుగోలు చేసిన లడ్డూల కంటే తక్కువ ఇచ్చారని అడిగిన భక్తుడికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా విధి నిర్వహణ పట్ల అలసత్వం వహించిన దుర్గగుడి ఉద్యోగికి ఆలయ ఈవో శీనానాయక్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన శుక్రవారం దుర్గగుడిలోని కనకదుర్గ నగర్‌ ప్రసాదాల కౌంటర్‌లో చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పిన్నిబోయిన జగదీష్‌ అనే భక్తుడు కనకదుర్గనగర్‌లోని కౌంటర్‌ నంబర్‌–3లో రూ. 500 చెల్లించి 30 లడ్డూలు, 5 పులిహోర ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే కౌంటర్‌లో లడ్డూలు ఇచ్చే సిబ్బంది జగదీష్‌కు 28 లడ్డూలు, 5 పులిహోర ప్యాకెట్లను ఇచ్చాడు. దీంతో కౌంటర్‌ బయటకు వెళ్లిన జగదీష్‌ తాను కొనుగోలు చేసిన లడ్డూలను లెక్కించగా 2 తక్కువగా రావడంతో సిబ్బందిని నిలదీశాడు. తొలుత లడ్డూలను తక్కువగా ఇచ్చాననే విషయాన్ని అంగీకరించకుండా గట్టిగా నిలదీయడంతో మిగిలిన రెండు లడ్డూలను అందించారు. ఈ విషయాన్ని కౌంటర్ల వెనుక ఉన్న సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించకపోవడంతో వెంటనే జగదీష్‌ కొండపైకి చేరుకుని ఈవోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే విచారణ చేపట్టిన ఈవో శీనానాయక్‌ సూపర్‌వైజర్‌ ఏడుకొండలను విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ప్రసాదం కౌంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని లక్ష్మీపై చర్యలు తీసుకోవాలని ఏఈవో చంద్రశేఖర్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement