ఈఎన్‌టీ విభాగాధిపతికి అభినందనలు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్‌లో నిర్వహించిన అరుదైన శస్త్ర చికిత్సలను దక్షిణ భారత చెవి, ముక్కు, గొంతు వైద్య సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చిన ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కె. రవిని శుక్రవారం ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో కర్నాటక రాష్ట్రం హుబ్లీలో జరిగిన దక్షిణ భారత చెవి, ముక్కు, గొంతు వైద్య సదస్సులో జీజీహెచ్‌లో నిర్వహించిన పలు అరుదైన కేసులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రోగుల స్వర పేటిక సమస్యలు, స్వరం మార్పునకు థైరోప్లాస్టీ శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్యలు ఎలా నివారించగలమో ఆయన వివరించారు. దీనికి వైద్య సదస్సులో పాల్గొన్న పలువురు చెవి, ముక్కు, గొంతు వైద్యుల అభినందనలు అందుకున్నారు.
కొండలమ్మకు
రూ.20.05 లక్షల ఆదాయం గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 53రోజులకు గాను రూ.20,05,385 ఆదాయంతో పాటు బంగారం 6 గ్రాములు, వెండి 100 గ్రాములు వచ్చింది. అలాగే అమ్మవారి దేవస్థాన దత్తత ఆలయం రెడ్డిపాలెం అభయాంజనేయస్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కించగా రూ.49,299 వచ్చింది. అమ్మవారి అన్నదాన నిమిత్తం రూ.24,716 వచ్చింది. హుండీల లెక్కింపులో దేవస్థాన సిబ్బంది, ఉయ్యూరు, గుడ్లవల్లేరు, వేమవరం సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరలు పాల్గొన్నారు. మచిలీపట్నం దేవాదాయ సూపర్‌వైజర్ శ్రీనివాసరరావు, తనిఖీదారుగా వ్యవహరించారు.
పోస్టల్ బ్యాలెట్
ఓటింగ్ పరిశీలన పంట కోత ప్రయోగంతో దిగుబడి అంచనా
పెనమలూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన శుక్రవారం పెనమలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా జరపాలని ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లతో పాటు, కౌంటింగ్ కూడా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో అన్నపూర్ణదేవి, ఎంఏవో కనకమహాక్ష్మి పాల్గొన్నారు.
పెనమలూరు: పంట కోత ప్రయోగంతోనే కచ్చితమైన పంట దిగుబడి గణాంకాలు వెల్లడవుతాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మునజీర్ జిలాని సమూన్ అన్నారు. గోసాలలో శుక్రవారం ఖరీఫ్ పంట దిగుబడి ప్రయోగాన్ని ఆయన స్వయంగా వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణాంకాలు కచ్చితంగా ఉంటేనే ప్రభుత్వానికి పంట ఉత్పత్తి అంచనాలు తెలుస్తాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, పంటల బీమా పరిహారం ఈ ప్రయోగంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు వణుకూరు వీరవెంకటేశ్వరరావు చెందిన 84 సెంట్ల పొలంలో ఎంటీ యూ 1061 వరి సాగు జరగగా పొలంలో 5X5 మీటర్ల విస్తీర్ణంలో పంటను కోసి, నూర్చి తూకం వేశారు. ఈ ప్లాట్‌లో 18,600 కిలోల దిగుబడి వచ్చింది. ఎకరాకు 33 బస్తాలు(75 కేజీలు) వచ్చినట్లు గుర్తించారు. వ్యవసాయాధికారి జ్యోతి రమణి, జేడీఏ వేణుగోపాలరావు, ఏడీఏ మునిధర్ తదితరులు పాల్గొన్నారు.