గన్నవరం: నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. అధికార కూటమి పార్టీల కుట్రలు, కుత్రంతాలు, మద్యం, ధన ప్రవాహాన్ని తట్టుకుని అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులు విజయబావుటా ఎగురవేశారు. ముఖ్యంగా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లోని కీలక గ్రామపంచాయతీలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.
38మంది విజయం..
గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి ఫేజ్‌లో భాగంగా నియోజకవర్గంలోని 84 గ్రామపంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 80 చోట్ల ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవమైన స్థానాలతో కలిపి వైఎస్సార్ సీపీ బలపరిచిన 38మంది అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కేవలం 34 చోట్ల మాత్రమే గెలుపొందారు. జనసేన తరఫున ఇరువురు, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్రులు ఏడుగురు, టీడీపీ రెబల్స్ ఇరువురు సర్పంచ్‌లుగా విజయం సాదించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి సంస్థాగతంగా గట్టి పట్టు ఉన్న గ్రామపంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థులు జెండా ఎగురవేయడంతో పాటు మరికొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ సీపీ శ్రేణులను ముందుండి నడిపించడం పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలం పుంజుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెబుతున్నారు.
టీడీపీ అంకెల గారడీ..
గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు నియోజకవర్గంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. అత్యధిక స్థానాల్లో టీడీపీ సర్పంచ్, వార్డు సభ్యులు ఓటమికి గురికావడంతో పాటు టీడీపీ బలంగా ఉండే చోట సైతం వైఎస్సార్ సీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులను ఆందోళనలోకి నెట్టింది. స్వయంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గన్నవరం మండలంలో 20 గ్రామపంచాయతీలకు ఎన్నికల జరగగా టీడీపీ కేవలం ఐదు స్థానాలకు పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు కలవరానికి గురిచేసింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఎమ్మెల్యే వర్గం షాక్‌కు గురైంది. దీంతో టీడీపీ అంకెల గారడీకి దిగింది. స్వతంత్ర అభ్యర్థులు, టీడీబీ రెబల్స్ సర్పంచ్ అభ్యర్థులను కూడా తమ ఖాతాలోకి వేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం గమనార్హం.
గన్నవరం ‘పంచాయతీ’లో
వైఎస్సార్ సీపీ ప్రభంజనం
ఫలితాల వివరం ఇలా..
మండలం స్థానాలు వైఎస్సార్ సీపీ టీడీపీ జనసేన బీజేపీ స్వతంత్రులు టీడీపీ రెబల్స్
గన్నవరం 21 12 5 01 01 02 0
ఉంగుటూరు 27 13 11 0 0 3 0
బాపులపాడు 27 12 10 01 0 02 02
విజయవాడ రూరల్ 09 01 08 0 0 0 0


