వీరులపాడు: నాటు కోళ్ల చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో గిరిజనుడు తిమ్మసర్తి నరేష్‌ను బంధించి చిత్ర హింసలు పెట్టి హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప పేర్కొన్నారు. వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లి గ్రామానికి చెందిన మృతుడు తిమ్మసర్తి నరేష్ కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటప్ప మాట్లాడుతూ.. మృతుని భార్య అఖిల ఫిర్యాదు మేరకు కారకులైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయం గోడను ఆనుకుని నిర్వహిస్తున్న పందెం కోళ్ల షెడ్డు వద్ద కోళ్లు దొంగి లించాడనే అనుమానంతో విచక్షణా రహితంగా దాడి చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని, చట్ట ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్టీ కమిషన్ తరఫున బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.8.25 లక్షల పరిహారం మంజూరు చేయగా, మొదటి విడతగా 50 శాతం రూ.4,12,500 విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిల్‌కుమార్, తహసీ ల్దార్ రవికుమార్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శాప్ కార్యాలయం వద్ద ధర్నా కేసులో సందీప్‌కు రిమాండ్
Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM
శాప్ కార్యాలయం వద్ద ధర్నా కేసులో సందీప్‌కు రిమాండ్ విజయవాడలీగల్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై శాప్ కార్యాలయం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాపై నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేసిన శృంగారపాటి సందీప్‌కు న్యాయమూర్తి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విజయవాడ జిల్లాజైలుకు తరలించారు. శృంగారపాటి సందీప్ సెప్టెంబర్ 21వ తేదీన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొనడంపై పోలీసులు కేసు నమోదుచేశారు. అతడిని విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెంలో అరెస్టు చేసి బుధవారం ఏడో అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
గోసాల శివారులో యువకుడి హత్య పెనమలూరు: మండలంలోని కంకిపాడు లాకుల వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కంకిపాడుకు చెందిన పెమ్మాడి మహేష్ (26) సమోసాల దుకాణంలో పనిచేస్తాడు. అతనిపై కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీటు ఉంది. కంకిపాడుకు చెందిన రమేష్, గోసాలకు చెందిన సాయి, మహేష్ స్నేహితులు. వారు ముగ్గురూ కలిసి బుధవారం మద్యం తాగారు. మద్యం మత్తులో మహేష్, రమేష్ గొడవపడ్డారు. సాయి వారిని నివారించే యత్నం చేశాడు. దీంతో మహేష్ తన వద్ద ఉన్న కత్తితో సాయిపై దాడికి యత్నించాడు. సాయి అక్కడే ఉన్న దుంగతో మహేష్ దవడపై బలంగా కొట్టాడు. మహేష్ ముఖం, దవడ పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రమేష్, సాయి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తాతాచారి తెలిపారు.
క్రెడిట్ కార్డు రద్దు పేరుతో మోసం సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,29,857 దోచుకున్నారు. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. 60 ఏళ్ల చీమకుర్తి త్రివిక్రమరావు కుటుంబ సభ్యులతో కలసి నగరంలోని దుర్గాపురం, పసుపులేటివారి వీధిలో నివసిస్తున్నారు. గత నెల 31న తివిక్రమరావుకు ఆకాష్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి తాను ఎస్‌బీఐ బ్యాంక్ టెక్నికల్ విభాగానికి చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్ క్లోజ్ చేసే పక్రియలో భాగం వచ్చే ఓటీపీ చెప్పాలని త్రివిక్రమరావును నమ్మించాడు. అతను ఓటీపీ చెప్పిన వెంటనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.500 మరో ఖాతాకు బదిలీ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే ఫోన్ చేసి అడగ్గా ఆ డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని ఆకాష్ సూచించాడు. అనంతరం నవంబర్ ఒకటో తేదీన మరోసారి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు ఇంకా రద్దవలేదని మళ్లీ ఓటీపీలు చెప్పాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన త్రివిక్రమరావు మరోసారి ఓటీపీలు చెప్పారు. అనంతరం ఆరు విడతల్లో రూ.1,29,857 మేర నగదు అతని ఖాతా నుంచి వేరే ఖాతాలకు జమవడాన్ని గుర్తించి ఎస్‌ఎన్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరేష్ మృతికి కారుకులపై కఠిన చర్యలు
Advertisement


