ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు 25వ తేదీలోపు ‘పది’ పరీక్ష ఫీజు చెల్లించాలి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి ఆరంభమైన కార్తిక మాసోత్సవాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం దీపావళి వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు పంచహారతుల సేవ చేశారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ వద్ద ఆలయ అర్చకులు లక్ష్మీపూజను జరిపించారు. అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్మీ విగ్రహాల వద్ద ఆలయ ఈవో శీనానాయక్‌ దంపతులు, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ దంపతులతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది నేతి దీపాలను వెలిగించారు. అమ్మవారి ఆలయం, రాజగోపురం ఎదుట ఈవో, చైర్మన్‌ కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చి వేడుకలలో పాల్గొన్నారు. దీపావళి ఉత్సవాల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పదో తరగతి 2027 మార్చిలో జరిగే పరీక్షలకు రెగ్యులర్‌, ఒకసారి తప్పిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 25వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌. చంద్రకళ తెలిపారు. ఈ నెల 26 నుంచి డిసెంబర్‌ రెండో తేదీ వరకూ రూ.50 అపరాధ రుసుంతో చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్‌ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ రూ.200, డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకూ రూ.500 అపరాధ రుసుంతో చెల్లించవచ్చని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్‌ ద్వారా పైన పేర్కొన్న విధంగా ఫీజులు చెల్లించాలని ఆయన తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, మూడు కన్న అధికంగా ఉన్న విద్యార్థులు సైతం రూ.125, మూడు సబ్జెక్ట్‌ల వరకూ రూ.110, వోకేషనల్‌ విద్యార్థులు అదనంగా రూ.60, యాజ్‌ కాండేషన్‌ రూ.300 చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): దత్తత తీసుకున్న చిన్నారులను ప్రేమాభిమానాలతో కూడిన కుటుంబ వాతావరణం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ దంపతులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గన్నవరం మండలంలోని బుద్ధవరం కేర్‌ అండ్‌ షేర్‌ హోమ్‌లో సంరక్షణ పొందుతున్న ఇద్దరు చిన్నారులను సోమవారం దత్తత తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్‌, కేరళకు చెందిన ఇరువురు దంపతులకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా చిన్నారులను అప్పగించారు. 2021లో ఈ దంపతులు ‘కారా’ పోర్టల్‌ ద్వారా పిల్లల దత్తత కోసం నమోదు చేసుకున్నారని దాని ద్వారా ఈ రోజు చిన్నారులను వారికి అప్పగించామని కలెక్టర్‌ చెప్పారు. అనంతరం ఏటా నవంబర్‌ నెలలో నిర్వహించే జాతీయ దత్తత మాసోత్సవాల్లో పోస్టర్‌ను కలెక్టర్‌ డీకే బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ ఆవిష్కరించారు. ఐసీడీఎస్‌ పీడీ ఐ. విమల తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంలో సోమవారం సాయంత్రం నుంచి కార్తిక మాసోత్సవాలు ఆరంభమయ్యాయి. మల్లేశ్వరాలయం, నటరాజస్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపాలను వెలిగించారు. తొలుత మల్లేశ్వరాలయం ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌లచే ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఆకాశ దీపాన్ని వెలిగించడంతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాలు, అర్చనలు, సహస్ర లింగార్చనలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement