ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతు బజార్లలో చేసిన బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ రైస్ మిల్లర్స్, హోల్ సేల్ అండ్ రిటైలర్ ట్రేడర్స్ అసోసియేషన్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసీ మాట్లాడుతూ బియ్యం ధరలు తగ్గించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. జిల్లాలోని 14 రైతు బజార్లలో ధరణి బియ్యం బ్రాండ్ పేరుతో నాణ్యమైన కేఎన్‌ఎం, బీపీటీ బియ్యం అమ్మకాలు ప్రారంభించామన్నారు. కేఎన్‌ఎం కిలో రూ. 50, బీపీటీ బియ్యం కిలో రూ. 49కు వినియోగదారులకు అందజేస్తామన్నారు. ఈ బియ్యాన్ని 26 కేజీల బ్రాండెడ్ సంచులలో ఒక కుటుంబానికి నెలకు ఒక సంచి మాత్రమే అనే పరిమితితో అమలు చేస్తున్నామన్నారు.
రైతు బజార్లు లేని చోట..
రైతు బజార్లు అందుబాటులో లేని వత్సవాయి, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, వీరులపాడు, ఎ.కొండూరు, గంపలగూడెం, రెడ్డిగూడెం, విస్సన్నపేట, జి.కొండూరు మండల కేంద్రాల్లో త్వరలో ధరణి రైస్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేసీ ప్రకటించారు. అదనపు ధరణి రైస్ కౌంటర్లు గుర్తించి, ఏర్పాటు చేయడంలో రైస్ మిల్లర్లు సహకరించాలని కోరారు. ప్రతి విక్రయ కేంద్రంలోనూ నిర్దేశించిన ధరలు, రకం, బస్తా బరువు, నెలవారీ కొనుగోలు పరిమితిని స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ విజిలెన్స్, బృందాలు ఇప్పటికే 36 చోట్ల తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 13 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.వి సతీష్, జిల్లా పౌరసరఫరాల అధికారి పి. వాణి, ఎన్టీఆర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


