గన్నవరం రూరల్: మండలంలోని సూరంపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలు కుటుంబాలు ఆదివారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. సూరంపల్లి శివారు రామచంద్రాపురం గ్రామానికి చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరగా వంశీ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పెదపూడి సుధాకర్, రమేష్, శోభనాద్రి, రాజా రవీంద్ర, కిషోర్ కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్సార్ సీపీ నాయకులు సర్నాల రాంబాబు, కూరాకుల కోటేశ్వరరావు, సర్నాల లక్ష్మణరావు, కాజా వెంకట సుబ్బారావు, భూక్యా కోటేశ్వరరావు, కై లే శివకుమార్, పోలిమెట్ల జయరాజు, నీలం ప్రవీణ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పడమట సురేష్, పసుపులేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురంలోని పున్నమిఘాట్లో జరుగుతున్న జాతీయ సరస్ మేళాను దేశంలోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్, ఆయన సతీమణి టాన్ యుక్సియూ, మినిస్టర్ కౌన్సిలర్ డాక్టర్ జొ గుఓహుయ్, సెకెండ్ సెక్రటరీ గువో డోంగ్డాంగ్, రాయబారి కార్యదర్శి లీ అన్నన్ ఇతర ప్రతినిధులతో కలిసి ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. మహిళలతో మాట్లాడి వారి ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సరస్ మేళాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి సందర్శించారు. సెర్ప్ డైరెక్టర్ (అడ్మిన్) కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు రూ.3.50 కోట్ల మేర వ్యాపారం జరిగిందని తెలిపారు.
గన్నవరం: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గన్నవరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గౌడపేటకు చెందిన నాగ శ్రీనివాసరావు(55) వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో పాటు మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. తీవ్రమైన తలనొప్పి భరించలేక ఐదు రోజుల క్రితం ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం శ్రీనివాసరావు కోలుకుని రెండు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటి వరండాలో వైర్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.


