రాధా వర్సెస్‌ బొండా ఉమా! | - | Sakshi
Sakshi News home page

రాధా వర్సెస్‌ బొండా ఉమా!

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమిలో రాజకీయం రసకందాయంలో పడింది. విజయవాడ మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని బందర్‌రోడ్డులోని ఒక హోటల్‌లో తెలుగుదేశం, జనసేన నేతల మధ్య డివిజన్ల పంపకానికి సంబంధించి చర్చలు వాడీవేడిగా జరిగాయి. తన కుమారుడు బొండా సిద్ధార్థ్‌కు మేయర్‌ పదవి ఇప్పించాలని చివరి వరకూ ప్రయత్నాలు చేసిన సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆ పదవి వంగవీటి రాధాకు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఆగ్రహాన్ని శుక్రవారం జరిగిన చర్చల్లో చూపించినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో పది సీట్లు తగ్గకుండా కేటాయించాలని జనసేన పట్టుబట్టగా సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సీట్లు ఇస్తా, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని బొండా స్పష్టం చేశారు.

చిన్నిపై చిరాకు..

పొత్తు ధర్మం పాటించాలంటూ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, ‘పొత్తా, బొంగా..’ అంటూ ఆగ్రహంగా లేచి బయటకు బొండా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని ఆపే ప్రయత్నం చేయగా ఆయనపై కూడా చిరాకు పడినట్లు తెలిసింది. చివరికి విజయవాడ తూర్పులో ఏడు సీట్లు జనసేనకు, రెండు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సెంట్రల్‌ నాలుగు కాగా పశ్చిమపై ఒక అంగీకారానికి రాలేదని సమాచారం. శనివారం ఉదయం మళ్లీ చర్చించుకున్న తర్వాత సీట్లను ప్రకటించాలని ఒక అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న పట్టాభి, ఐలాపురం రాజా, బొప్పన భవకుమార్‌, జనసేన నుంచి వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు.

ఉయ్యూరులోనూ తేలని పంచాయితీ..

ఉయ్యూరు మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలోనూ టీడీపీలో తర్జనభర్జన పడుతున్నారు. ఉయ్యూరు మునిసిపాలిటీ ఎస్సీ రిజర్వు కావడంతో వైఎస్సార్‌ సీపీ ఆ సామాజిక వర్గానికి చెందిన పైడిముక్కల దివ్య పేరును ఖరారు చేసింది. మరోవైపు 32 వార్డులకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. అయితే అధికార పక్షమైన తెలుగుదేశం మాత్రం ఇంకా చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తుండటంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. తొలుత కలపాల సిద్ధు, కొండా ప్రవీణ్‌, బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన దేవమణి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఉయ్యూరు మునిసిపల్‌ పీఠంపై పట్టు సాధించేందుకు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ వర్గం ప్రయత్నం చేస్తోంది. తమ వర్గానికి చెందిన నాయకుడికే చైర్మన్‌గా అవకాశం కల్పించాలని ఆ వర్గం పట్టుబడుతోంది.

నాలుగిస్తా.. తీసుకుంటే

తీసుకోండి లేకపోతే లేదు

డివిజన్ల పంపకంపై జనసేనకు

స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా

బెజవాడ కూటమిలో

కుదరని ఏకాభిప్రాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement