పెనమలూరు: ఆడుకోవడానికి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడం.. కన్నవారికి తీరని శోకంగా మారింది. కానూరు ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన కొరుమిల్లి జోగారావు రామాలయం వీధిలో ఒక అపార్టుమెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య సత్య, కుమారులు నాగదుర్గత్రిలోక్ (11), మోక్షిత్రామ్ ఉన్నారు. అయితే శక్రవారం అపార్టుమెంట్ సమీపంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు వినిపించింది. ఇంట్లో ఉన్న తల్లి సత్య బయటకు వెళ్లి చూడగా పెద్దకుమారుడు నాగదుర్గత్రిలోక్ తలకు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు. కుమారుడిని వెంటనే కానూరులో ప్రైవేటు ఆస్పత్రికి చికిత్సకు తీసుకు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనా స్థలం వద్ద పరిశీలించగా మృతుడు నాగదుర్గ త్రిలోక్.. మరో ముగ్గురు చిన్నారులు టపాకాయలు కాలుస్తూ అక్కడే ఉన్న పెయింటింగ్ డ్రమ్ములో వేశారు. దీంతో డ్రమ్ము ఒక్కసారిగా పేలటంతో బాలుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


