గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/పటమట (విజయవాడతూర్పు): మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. విజయవాడ నగర పాలక సంస్థతోపాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మునిసిపాలిటీల ఎన్నికల నిర్వహణకు బుధవారం షెడ్యూల్ విడుదలవడం.. ఆయా మునిసిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయపార్టీలు పోటీలో నిలిచే అభ్యర్థులను సిద్ధం చేసుకున్నాయి. నామినేషన్లు దాఖలుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో పోటీలో నిలిచే అభ్యర్థులు సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లకు సమయం ఉండడంతో తొలి రోజు నుంచే నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తొలిరోజు ఉత్సాహంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
వీఎంసీ పరిధిలో 19 నామినేషన్లు
విజయవాడ నగరపాలక సంస్థకు మేయర్ స్థానానికి నేరుగా ఎన్నిక జరుగుతుండగా.. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అయితే నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో కార్పొరేటర్ల స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మూడ సర్కిళ్ల పరిధిలో మొత్తం 16 మంది డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు 19 నామినేషన్లను దాఖలు చేశారు. సర్కిల్–1 పరిధిలోని నాలుగు నామినేషన్లు దాఖలవ్వగా, సర్కిల్–2 పరిఽధిలో 11, సర్కిల్–3 పరిధిలో నలుగురు నామినేషన్లను ఆర్వోలకు సమర్పించారు. వీరిలో మూడు సర్కిళ్ల పరిధిలో వైఎస్సార్ సీపీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు.
● తిరువూరు మునిసిపాలిటీలో తొలిరోజు మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. అధికార కూటమి తరఫున తొలిరోజు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
● జగ్గయ్యపేట మునిసిపాలిటీలో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా ఫైల్ కాలేదు.
● నందిగామ మునిసిపాలిటీలో తొలిరోజు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
● కొండపల్లి మునిసిపాలిటీలో తొలిరోజు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన రాజకీయపార్టీల నుంచి నామినేషన్లు వేయలేదు.
మొదలైన నామినేషన్ల సందడి


