వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్న ప్రజాప్రతినిధిపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిపై సైతం టీడీపీ గూండాలు దాడికి తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ఉపయోగించుకుని అణచివేతకు పాల్పడినా, ప్రాణాలకు తెగించైనా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అవినాష్ డిమాండ్ చేశారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉద్రిక్తతలు, అక్రమ అరెస్టుల మధ్య కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి విమర్శించారు. విజయవాడ సత్యనారాయణపురంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో గెలుపుపై నమ్మకం లేకనే టీడీపీ ప్రభుత్వం అరాచకాలు, కుయుక్తులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి భయపడే అధికార పార్టీ.. పోలీసుల సపోర్ట్‌తో దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో.. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొప్పుల రవిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న యువతను బెదిరించడం సరికాదని హితవు పలికారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, పుంగనూరులో నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


