కుటుంబ సభ్యులకు తల్లి, పిల్లలు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులకు తల్లి, పిల్లలు అప్పగింత

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

కుటుంబ సభ్యులకు తల్లి, పిల్లలు అప్పగింత కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వివాహితపై రౌడీషీటర్‌ లైంగికదాడి మహిళ హత్య కేసులో నిందితులకు రిమాండ్‌

లక్ష్మీపురం: భర్త వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఇంటి వెళ్లిపోయిన భార్యను తిరిగి కుటుంబ సభ్యులకు పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇవి.. విజయవాడకు చెందిన వేముల కుమారి పెద్ద కుమార్తె రమాదేవిని గుంటూరులోని తుఫాన్‌ నగర్‌కు చెందిన శ్రీనుతో 2020లో ప్రత్తిపాడు చర్చిలో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా భర్త శ్రీను చెడు వ్యసనాలకు బానిసై, ప్రతి రోజు మద్యం తాగి భార్యను మానసికంగా, శారీ రకంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 20న శ్రీను పూటుగా మద్యం తాగి భార్యను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో అదే రోజు రాత్రి పిల్లల్ని తీసుకుని పొన్నూరులో ఉంటున్న అత్త మల్లేశ్వరి దగ్గరికి వెళ్లిపోయింది. ఈ విషయమై రమాదేవి తల్లి పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్త మల్లేశ్వరి రమాదేవి తల్లికి ఫోన్‌ చేసి భయపడాల్సిన అవసరం లేదని పొన్నూరులో ఉందని చెప్పి రమాదేవిని, పిల్లల్ని సోమవారం మధ్యాహ్నం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చింది. పోలీసులు వారిని తల్లి కుమారికి అప్పగించారు.

పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ రేబిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీఎంసీ ప్రజారోగ్య విభాగం వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సోమవారం సీతారామపురంలోని లాల్‌ బహదూర్‌ వీధిలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీఏఎస్‌ డాక్టర్‌ హరీష్‌ కుక్కలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా సెప్టెంబర్‌ 28న ప్రపంచ రేబిస్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారని, రేబిస్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన లూయిస్‌ పాశ్చర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని పాటిస్తారని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ రేబిస్‌ దినోత్సవం సందర్భంగా ‘వన్‌ హెల్త్‌’ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 86 కుక్కలకు టీకాలు వేయగా, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సంబంధిత 62 మంది సిబ్బందికి యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ చేసినట్లు పేర్కొన్నారు.

వీరులపాడు: మహిళపై లైంగికదాడికి పాల్పడిన రౌడీషీటర్‌పై కేసు నమోదు చేసినట్లు నందిగామ రూరల్‌ సీఐ వైవీఎల్‌ నాయుడు పేర్కొన్నారు. మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన వివాహిత(35) కడుపు నొప్పి వస్తుండటంతో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మందులు తెచ్చుకునేందుకు బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల సమీపంలోని అదే గ్రామానికి చెందిన మందా శ్రీకాంత్‌ అనే రౌడీషీటర్‌ ఆమెను బలవంతంగా తన నివాసంలోకి లాక్కెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతానని మహిళను బెదిరించాడు. కుటుంబ సభ్యుల సహాయంతో బాధిత మహిళ సోమవారం మధ్యాహ్నం వీరులపాడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సంఘటనా ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించామని, ప్రస్తుతం శ్రీకాంత్‌ పరారీలో ఉన్నాడన్నారు. అతనిపై ఇప్పటికే 10 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. సీఐ వెంట ఎస్‌ఐ అభిమన్యు ఉన్నారు.

విజయవాడలీగల్‌: ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో లభ్యమైన మహిళ మొండేనికి సంబంధించిన కేసులో నిందితులకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ 5వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్టుక్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌ పంప్‌హౌస్‌ వద్ద కూలింగ్‌ కెనాల్‌లో మహిళ మొండెం తేలుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పశ్చిమ జోన్‌ డీసీపీ గుణ్ణం రామకృష్ణ, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ ఎ. సుబ్రహ్మణ్యం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సాయంతో కెనాల్‌లోని శరీర భాగాలను వెలికితీశారు.

టాటూ ఆధారంగా..

అనంతరం మృతదేహం చేతిపై ఉన్న నెమలి పించెం టాటూ ఆధారంగా మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేయగా, మృతురాలు ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడకు చెందిన కర్రి దుర్గా కల్యాణి (29)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం మంగళగిరిలో నివసిస్తోంది. విచారణలో దుర్గ కల్యాణి ఒక హోటల్‌ యజమానితో సహజీవనం చేయగా బాబుకు జన్మనిచ్చి, ఆ బాబును భవానీపురం హెచ్‌.బి.కాలనీకి చెందిన మాంసం వ్యాపారి షేక్‌ షఫీ (46)కి దత్తత ఇచ్చింది. ప్రతిసారి డబ్బులు కావాలని వేధించడంతోపాటు బాబు విషయంలో గొడవలతో షఫీ ఈనెల 17న ఆమెను ఇంటికి పిలిచి, మటన్‌ కత్తితో హత్య చేశాడు. దీనికి అతని స్నేహితుడు షేక్‌ అబ్దుల్లా అలియాస్‌ దుర్గారావు సహాయం తీసుకొని, మృతదేహాన్ని ముక్కలు చేసి తుమ్మలపాలెం, గొల్లపూడి కూలింగ్‌ కెనాల్‌లో పడేశాడు. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement