ఆత్మవిశ్వాసమే విజయానికి నాంది | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే విజయానికి నాంది

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

ఆత్మవిశ్వాసమే విజయానికి నాంది సరస్‌ మేళా ఏర్పాట్ల పరిశీలన విజయవాడ వెల్ఫేర్‌ యూనిట్ల సందర్శన

తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఆధవ్‌ అర్జున్‌

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గెలుస్తామనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో క్రీడాకారులు మైదానంలో అడుగుపెట్టాలని.. అప్పుడే విజయాలు సొంతం చేసుకోగలరని బాస్కెట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, తమిళనాడు రాష్ట్ర పీడబ్ల్యూడీ, క్రీడా శాఖ మంత్రి ఆధవ్‌ అర్జున్‌ చెప్పారు. స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం ఆవరణలో 51వ సబ్‌ జూనియర్‌(అండర్‌–13) నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2026 సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు.

క్రీడల్లోనూ ఆసక్తి చూపాలి...

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడలపై కూడా ఆసక్తి చూపాలన్నారు. బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రెసిడెంట్‌ టి.చెంగల్‌రాయుడు, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ అక్టోబర్‌ 4వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ జరుగుతుందని, వివిధ రాష్ట్రాల నుంచి 54 బాల బాలికల జట్లు పోటీ పడనున్నాయని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీఎస్‌సీ బోస్‌ మాట్లాడుతూ పటమటలోని స్టెల్లా కళాశాల ఆడిటోరియం, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియం, కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భవానీపురం పున్నమీ ఘాట్‌లో అక్టోబర్‌ 8 నుంచి నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌, సరస్‌ మేళా కార్యక్రమాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అఽధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి వారికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్‌ ధ్యానచంద్ర మాట్లాడుతూ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్టమైన కార్యాచరణతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ డాక్టర్‌ డి. చంద్రశేఖర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ పి. సత్యకుమారి, చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ నిర్మల గ్లోరి తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఉమెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ చారు మాథుర్‌ సోమవారం విజయవాడ డివిజన్‌లోని వెల్ఫేర్‌ యూనిట్‌లను సందర్శించారు. ముందుగా విజయవాడ డివిజన్‌ వర్షా సొనాకియాతో కలసి ఈ–వరల్డ్‌ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలు ఉండే ‘ఆశా కిరణ్‌’ను సందర్శించి అక్కడి వారితో ముచ్చటించారు. పిల్లల్లో నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, స్వయం సమృద్ధిని పెంపొందించే దిశగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్‌లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం విజయవాడ డివిజన్‌ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement