గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ స్పష్టమైన పాలసీ రూపొందించాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా లో పెద్ద సంఖ్యలో ఆర్పీలు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మావతి, కార్యదర్శి కుప్పిలి ద్రాక్షాయణి మాట్లాడుతూ ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
శ్రమను గుర్తించండి..
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ ఆర్పీల శ్రమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం పెంపు సాధించేవరకు ఆర్పీలకు ఏఐటీయూసీ అండగా నిలబడుతుందన్నారు. ఆర్పీల భవిష్యత్ పోరాటాలకు మద్దతు ఇస్తామన్నారు. ఈ ధర్నాలో ఆర్పీల సంక్షేమ సంఘం ప్రతినిధులు దీవెన, లత, జయలక్ష్మి, మనోరమ, సరస్వతి, వర్ణలత, ఏఐటీయూసీ నాయకలు సాంబశివరావు, తాతయ్య, శివకుమార్, పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద ఓ కారు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌హెచ్–16 రహదారిపై కోడూరుపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుంటూరు నుంచి తణుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు, దట్టమైన మంటలు, పొగలతో కారు దగ్ధం కావటంతో హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్ని ప్రమాదాన్ని ముందుగా పనికట్టిన ఆ కారు డ్రైవర్ చోడవరపు మోహన్ వరుణ్, ప్రయాణికులు చిట్టూరి గణేష్, అతని భార్య పూజిత హుటాహుటిన కిందకు దిగటంతో వారికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హనుమాన్‌జంక్షన్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి, రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.


