ఏసీబీ వలలో వార్డు సచివాలయ ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వార్డు సచివాలయ ఉద్యోగి

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

● రూ.7 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ● గతంలోనూ ఆ ఉద్యోగిది అదేతీరు

● రూ.7 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ● గతంలోనూ ఆ ఉద్యోగిది అదేతీరు

పటమట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో పేరు చేర్చేందుకు, తనకు సంబంధం లేని డిపార్ట్‌ మెంట్‌లోకి కూడా చొరబడి లబ్ధిదారుల నుంచి డబ్బులు దండుకోవటం ఆ సచివాలయ ఉద్యోగి ప్రత్యేకత. అయితే ఈ ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కాలేజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో అర్హతా ప్రమాణాలను పరిశీలించి వారికి పథకం వర్తింప చేయటానికి ఓ సచివాలయ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేయటంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. పటమట రామలింగేశ్వరనగర్‌కు చెందిన పాండ్రాజు దుర్గారావు ఫీజు రీయింర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తును పరిశీలించాలని వార్డు సచివాలయ సెక్రటరీ సాంబశివరావును పదేపదే కోరినా పట్టించుకోలేదు. రూ.20 వేల లంచం ఇస్తేనే చేస్తానని కరాఖండీగా చెప్పటంతో దుర్గారావు అతనితో బేరం మాట్లాడుకుని రూ.7 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దుర్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం ఏసీబీ ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు, అదనపు ఎస్పీ కె.శ్రవంతిరాయ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో నిఘా పెట్టి బాధితుడు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా సాంబశివరావును పట్టుకున్నారు. ఫైళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మొదటి నుంచీ అదేతీరు..

సచివాలయ వార్డు సంక్షేమ సెక్రటరీ సాంబశివరావుకు తొలుత రాజరాజేశ్వరిపేట వార్డు సచివాలయంలో పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ టిడ్కో ఇళ్ల వ్యవ హారంలో లబ్ధిదారులు కానివారికి ఇళ్లను ఇప్పిస్తా మని లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు తెలియటంతో అక్కడి నుంచి సర్కిల్‌–3 పరిధిలోని 17వ డివిజన్‌కు బదిలీ చేశారు. అక్కడ కృష్ణా రివర్‌ రిటైనింగ్‌వాల్‌ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు కేటాయించే క్రమంలో స్థానికులను లబ్ధిదారులుగా చేర్చాలంటే భారీ మొత్తంలో డిమాండ్‌ చేసి వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియటంతో అతడిని అక్కడి నుంచి రామలింగేశ్వరనగర్‌ సచివాలయానికి బదిలీ చేశారు. ఇటీవలే ఓ తండ్రీ కొడుకుల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ధ్రువీకరణకు రూ.10 వేలు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement