31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ | - | Sakshi
Sakshi News home page

31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ

రాజకీయ పార్టీల సమావేశంలో కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో కీలక దశ అయిన ఇంటింటి సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు అందించిన సహకారం అభినందనీయమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ అన్నారు. ఇదే భాగస్వామ్య స్ఫూర్తిని క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ప్రక్రియలోనూ కొనసాగించాలని ఆయన కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 17,13,445 ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా 15,89,731 ఫారాలను డిజిటలైజేషన్‌ చేసినట్లు తెలిపారు. 55,813 డెత్‌ కేసులతో సహా శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాల వల్ల 1,23,714 ఫారాల సేకరణ వీలుపడలేదన్నారు. ఈ ప్రక్రియపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ..

ఈ నెల 31న ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని.. ఇది పోలింగ్‌ కేంద్రాలు, బీఎల్‌వోల వద్ద అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ ముసాయిదా జాబితాలో పేర్లను సరిచూసుకోవచ్చని.. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30వ తేదీ వరకు ఆధారాలతో ఈఆర్‌వో లేదా ఏఈఆర్‌వోలకు దరఖాస్తు ద్వారా సమర్పించాలన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు నోటీసుల దశతో పాటు క్లెయిములు, అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దిన తర్వాతే అక్టోబర్‌ 3న తుది జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు.

కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తులు..

కొత్తగా ఓటు నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. వివరాల్లో సవరణ కోసం లేదా ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి పేరును బదిలీ చేసుకునేందుకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement