సుపారీ తీసుకొని హతమార్చిన వైనం నిందితులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరులు సెల్‌ఫోన్లలో సుపారి చెల్లింపు లావాదేవీలతో వెలుగులోకి నిందితులు మృతదేహాలను వెలికి తీసిన సమయంలో వీరు అక్కడే ఉన్నట్లు సమాచారం
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరులే..
టాస్క్‌ఫోర్స్: కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంటహత్యల కేసులో నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి తలనొప్పిగా మారడమే కాకుండా భవిష్యత్తులో వారి జీవనాధారమైన చేపలవేటలోనూ తీవ్ర పోటీదారులవుతారని భావించి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను అదే సామాజిక వర్గానికి చెందిన వారు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారణైంది.
సుపారీ గ్యాంగ్‌గా ‘వీఆర్ బాయ్స్’..
జూన్ 27 రాత్రి చినగొల్లపాలెం ఎస్‌టీ కాలనీకి చెందిన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉండే శంకరపు శ్రీను, హత్యకు గురైన సుబ్బన్న, అయ్యపలతో చేపల వేట వద్ద హత్యకు ముందు ఘర్షణ జరిగింది. శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజుతో కలిసి గుడివాడకు చెందిన వీఆర్ బాయ్స్ అని పిలిచే నలుగురు స్నేహితుల ద్వారా సుబ్బన్న, అయ్యప్పలను హత్య చేశారు. వీరి మృతదేహాలను వారి బైక్‌కే కట్టి నీటిలో వదిలేశారు.
లావాదేవీలపై నిఘా..
దీనిపై నిఘా పెట్టిన పోలీసులు వీఆర్ బాయ్స్ సుపారీ లావాదేవీలతో ఫోన్ల ద్వారా జరిగిన సంభాషణలు ద్వారా హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించినట్లుగా విశ్వసనీయ సమాచారం. చినగొల్లపాలెంకు చెందిన ఏ1 శంకరపు శ్రీను, ఏ2 జల్లా నాగరాజులున్నారు. వీరు కాకుండా సుపారి గ్యాంగ్ అయినటు వంటి వీఆర్‌బాయ్స్‌గా పిలువబడే ముగ్గురు యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, గుడివాడ కార్మికనగర్‌కు చెందిన అబ్దుల్‌ఖాదర్ జిలానీలతో పాటు మరొక వ్యక్తి అబ్బూరి విజయరత్నం (దాస్)లను అరెస్ట్ చేశారు.
గుడివాడ నుంచి వచ్చిన నిందితులు వీఆర్ బాయ్స్.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అనుచరులు కాగా వారిలో డొక్కుమాల శ్రీకాంత్‌పై ఇప్పటికే రౌడీ షీట్ ఉంది. మృతదేహాలను వెలికి తీసే సమయంలో వీఆర్ బాయ్స్ కూడా అక్కడే ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో సుపారీ జరిగిందంటే.. దీనిలో అధికార పార్టీలోని కీలక నాయకుల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అనుమానాలకు తావిస్తోంది. కేసు ఛేదన సమయంలో ఒకానొక సందర్భంలో కృత్తివెన్ను పోలీసులను గుడివాడ ఎమ్మెల్యే బెదరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు గుడివాడ నియోజకవర్గంలో వీఆర్ బాయ్స్ చేసిన ఆగడాలు, ఆకృత్యాలు అనేకం ఉన్నాయనే విషయాలపై అక్కడి అధికార పార్టీకి చెందినవారు, ముఖ్యనాయకులు చర్చించుకోవడం గమనార్హం.


