ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం భక్తులకు దర్శన అనంతరం కదంబ ప్రసాదం పంపిణీ కొనసాగిన సారె సమర్పణలు
భక్తులకు కదంబ ప్రసాదం..
ప్రణామమమ్మా అంటూ భక్తితో కొలిచిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్‌తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
పూజా సామగ్రిగా కూరగాయల దండలు..
శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్‌తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు.
ఆకట్టుకున్న కూరగాయల ప్రతిమలు..
రాజగోపురం ఎదుట కూరగాయలతో చేసిన ఆకృతులు, ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజగోపురం ఎదుట చిన్న అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద కరివేపాకుతో భారీ చెట్లను తీర్చిదిద్దారు. ఇక ట్రస్ట్‌బోర్డు సభ్యుల చాంబర్ ఎదుట, చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రతిమలు అలరించాయి. ఆయా ప్రతిమల వద్ద భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కనిపించారు.
పలు జిల్లాల నుంచి వితరణగా..
పలు జిల్లాల నుంచి ఆకుకూరలు, కాయగూరలను రైతులు, హోల్‌సేల్ వ్యాపారులు అమ్మవారికి సమర్పించారు. విజయవాడ నున్నలోని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్‌సేల్ కూరగాయల మార్కెట్, కేదారేశ్వరపేట హోల్‌సేల్ ఫ్రూట్స్ మార్కెట్, గుంటూరు ఆకుకూరల మార్కెట్, నారా కోడూరులోని కూర గాయల వ్యాపారులు, యడ్లవల్లి రైతులు, సంగం జాగర్లమూడి రైతులు, వట్టిగుడిపాడు, కొత్తపేట, ఏలూరు, తణుకు, సిద్ధాంతం, మడికి, నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాలకు చెందిన రైతులు కూరగాయలను అందజేశారు.
కొంత వరకే అలంకరణలు..
శాకంబరీ ఉత్సవాలతో రాజగోపురం, ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున కూరగాయల దండలను అలంకరించారు. అయితే భక్తులు ఎక్కువగా కొండపైకి నడుచుకుంటూ వచ్చే ఘాట్‌రోడ్డు మార్గంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, చిన్న గాలిగోపురం, నటరాజస్వామి వారి ఆలయం, నాగేంద్ర పుట్ట పరిసరాల్లో కూరగాయల దండలు కనిపించలేదు. మరో వైపున ఆయా పరిసరాల్లో ప్లాస్టిక్ డబ్బాలు, అరుగుపై సిద్ధం చేసిన కూరగాయల దండలను వదిలేయడంతో భక్తులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు.
ఆషాఢ మాసం నేపథ్యంలో సారె సంబరం కొనసాగుతోంది. సోమవారం 27కు పైగా భక్త బృందాలు, సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నూతన పూజా మండపం వద్ద భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో శీనానాయక్, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్ కదంబ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం నూతన పూజా మండపం వద్దకు చేరుకున్న భక్తులు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో కలిసి కదంబ ప్రసాదాన్ని స్వీకరించడం కనిపించింది.


