ఆన్‌లైన్‌లో బుక్ చేసినా సరఫరా చేయని పరిస్థితి బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయాలు ఫోన్ నంబర్లను మార్చేస్తూ బురిడీ సమయానికి సిలిండర్ దొరక్క ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు
బందరులో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు చేస్తున్న మోసాలపై విచారించి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నాను. విధుల్లో చేరాక ఏజెన్సీల నిర్వహణ తీరుపై విచారించి చర్యలు తీసుకుంటాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తాం.
– ఆంజనేయులు,
డెప్యూటీ తహసీల్దార్, బందరు
మచిలీపట్నంటౌన్: గ్యాస్ ఏజెన్సీల మాయాజాలానికి వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఇరాన్ యుద్ధం నెపంతో కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి.. ఇబ్బందులకు గురి చేసిన ఏజెన్సీల నిర్వాహకులు.. ఇంకా అదే పంథాని అవలంభిస్తున్నారు. దీంతో నగరం, పట్టణం, పల్లె అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 42 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3లక్షలకు పైగా డొమెస్టిక్ వినియోగదారులకు సిలిండర్ల సరఫరా జరుగుతోంది.
‘బ్లాక్’ దందా..
గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అర్జెంటుగా కావాలని వచ్చేవారి నుంచి రూ.1600 నుంచి రూ. 1700కు అంటే దాదాపు రూ. 800 అధిక ధరకు విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ముఖ్యంగా బందరులోని ఓ హెచ్‌పీ ఏజెన్సీ వద్ద బ్లాక్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు వినియోగదారుల ఫోన్ నంబర్లను మార్చేసి వారికి ఆన్‌లైన్‌లో బుకింగ్ కాకుండా కంప్యూటర్‌లో మార్పు చేసి, ఏజెన్సీకి చెందని కొందరి నంబర్లను ఆన్‌లైన్‌లో జోడించి బుక్ చేసి ఆ గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్లో నుంచి గ్యాస్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేద్దామని చూస్తే ఈ నంబర్ సరికాదని చెబుతోందని, తీరా ఏజెన్సీ వద్దకు వచ్చి ఆరాతీస్తే మీరు లింకు చేసిన ఫోన్ నంబర్ తప్పుగా చెప్పి ఉంటారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసింది. బందరుకు చెందిన వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసినా రోజుల తరబడి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయని పరిస్థితి ఇక్కడ నెలకొంటోందని చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్‌లను సరఫరా చేయకపోవడంతో బుకింగ్ క్లోజ్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రెండు, మూడు సార్లు బుక్ చేసినా గ్యాస్ ఇంటికి అందని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. గ్యాస్ రాలేదని వినియోగదారులు ఏజెన్సీలకు వెళితే ఇరాన్ యుద్ధం తర్వాత గ్యాస్ బుకింగ్‌ను త్వరితగతిన రద్దు చేస్తున్నారని, అందువల్లే గ్యాస్ మీకు ఇవ్వలేకపోయామని వంకలు చెబుతున్నారని వివరిస్తున్నారు. ఇంటికి గ్యాస్‌ను సరఫరా చేసే కార్మికులు సైతం వినియోగదారుల నుంచి రూ. 30 నుంచి రూ. 40 వీలును బట్టి అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
అధిక ధరలు..
డెలివరీలు సక్రమంగా కాక వినియోగదారులే గోడౌన్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నా.. అదనపు వసూళ్లు ఆగడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి వినియోగదారుడే వెళ్లున్నాడు కాబట్టి డెలివరీ చార్జీలు తగ్గించాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


