వైభవంగా ఆదిదంపతుల గిరిప్రదక్షిణ స్వర్ణకవచంతో అమ్మవారి దర్శనం భక్తిశ్రద్ధలతో సరస్వతి హోమం వేడుకగా ఏరువాక పౌర్ణమి
సువర్ణ కాంతులతో..
దుర్గమ్మ కొండపై పండుగ వాతావరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నిజ జ్యేష్ట పౌర్ణమి, మూలానక్షత్రం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించగా, మూలా నక్షత్రం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగ శాలలో సరస్వతి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. మరో వైపున ప్రాంగణంలోనే రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు.
వైభవంగా గిరిప్రదక్షిణ..
పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం వైభవంగా నిర్వహించారు. ఘాట్‌రోడ్డు లోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణ, ఏసీ రంగారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కొలువై ఉండగా, దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్త జనుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు అమ్మవారికి పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఆలయ డీఈవో కిశోర్‌కుమార్ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానప్రదాయినీ నమోస్తుతే..
మూలా నక్షత్రం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి సన్నిధిలో సరస్వతి హోమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో ఆలయ అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువు రు విద్యార్థులు హోమాన్ని దర్శించుకుని తమకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిచారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు.
ఏరువాక సంబరం..
దేవదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి నాడు అనాదిగా భూమాతను, పశువులను, గంగమ్మను పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించామని వారు తెలిపారు.
పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను స్వర్ణకవచంతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు, వీఐపీలు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువురు న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ ప్రముఖులు విశేషంగా పాల్గొన్నారు.


